మాంద్యం ఉంది ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇప్పుడివ్వలేం..!

మాంద్యం ఉంది ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇప్పుడివ్వలేం..!

   బకాయిలపై హైకోర్టులో సర్కారు వాదనలు

   2014 నుంచి ఇప్పటిదాకా రూ.4,253.36 కోట్లు చెల్లించినం

రాయితీలు, జీహెచ్ఎంసీ బకాయిలు కలిపినా రూ.622 కోట్లు అదనంగా ఇచ్చామని వివరణ

ఈ లెక్కలన్నీ అంకెల గారడీలా ఉన్నాయన్న డివిజన్​ బెంచ్

హుజూర్​నగర్​కు వందకోట్ల వరాలిచ్చారు.. ఆర్టీసీకి ఇవ్వలేరా?

అప్పుకు గ్యారెంటీ ఇచ్చినంత మాత్రాన.. డబ్బులు ఇచ్చినట్టేనా?

సరైన వివరాలతో రావాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశం

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెల గారడీ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించేశామని చెబుతోందే తప్ప, బకాయిలేమీ లేవని చెప్పడం లేదు. చేయాల్సిన చెల్లింపులన్నీ ముందే చేసేశామని ఆర్టీసీకి చెప్పారా? హుజూర్‌‌నగర్‌‌ ఎన్నికల తర్వాత సర్కారు వంద కోట్ల మేర వరాల వర్షం కురిపించింది. ఆర్టీసీకి ఇవ్వడానికి డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది.

‘‘ఆర్టీసీకి కు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ ఇచ్చేశాం. 2014 నుంచి ఇప్పటి వరకూ రూ.4,253.36 కోట్లు చెల్లించాం. ఆర్​టీసీకి చెల్లించాల్సిన దాని కంటే అదనంగా రూ.622 కోట్లు చెల్లించాం. జీహెచ్ఎంసీ రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు ఇచ్చింది. ప్రభుత్వం సంస్థకు అదనంగా చెల్లించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కూడా ఆర్టీసీకి ఇక ఎటువంటి బకాయిలు చెల్లించక్కర్లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా కోర్టు కోరుతున్నట్లుగా ఇప్పుడే రూ.47 కోట్లను ఇవ్వలేం”అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపింది.

ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నిజంగానే బకాయిలన్నీ చెల్లించేసిందా? ఒకవేళ చెల్లించాల్సి ఉంటే ఎంత చెల్లించాలి? తదితర లెక్కలన్నింటినీ తమ ముందుంచాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ఈ లెక్కలన్నింటిపై పూర్తి అవగాహన ఉన్న అధికారిని వెంటబెట్టుకుని స్వయంగా తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీకి స్పష్టం చేసింది. ఈ పిటిషన్​లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ ఎందుకు పూర్తి చేయలేదు.. ఎంత కాలంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయగలరో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధంగా ప్రకటించడంతోపాటు కార్మికుల డిమాండ్లలో న్యాయబద్ధమైన వాటిని పరిష్కరించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

ఐదేళ్లుగా ఏం చేస్తున్నారు?

అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, విభజన చట్టంలోని సెక్షన్‌ 9 ప్రకారం ఆర్టీసీ విభజన పూర్తి కాలేదన్నారు. ఆస్తి, అప్పుల పంపిణీ జరగలేదని, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని వివరించారు. ఏజీ వాదనలకు బెంచ్ అడ్డుతగులుతూ, జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ 42%,  ఏపీ 58% ప్రకారం బకాయిలు చెల్లించేందుకు అడ్డంకులు ఏమున్నాయని ప్రశ్నించింది. ఆస్తి, అప్పుల విభజన ప్రక్రియ ఆలస్యం కావొచ్చు.. విబేధాలు రావొచ్చని, అయితే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోకుండా ఐదేళ్లుగా ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

అంకెల గారడీ తప్ప ఏమీ లేదు..

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాల్ని పరిశీలించిన కోర్టు.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెల గారడీ ఆడుతున్నట్టుగా అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తన కౌంటర్‌ బకాయిలు చెల్లించేశామని చెబుతోందే తప్ప, బకాయిలేమీ లేవని చెప్పకపోవడాన్ని ఎత్తిచూపింది. ఈ అఫిడవిట్‌ ద్వారా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వాస్తవాలను నిజాయితీగా, స్పష్టంగా చెబుతారని ఆశించామని, కానీ అంకెల గారడీ తప్ప ఇందులో ఏమీ లేదని వ్యాఖ్యానించింది. చేయాల్సిన చెల్లింపులన్నీ ముందే చేసేశామని ఆర్టీసీకి చెప్పారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఉన్నాయని ఏజీ చెప్పడంతో హుజూర్‌నగర్‌ ఎన్నికల తర్వాత వంద కోట్లను సర్కార్‌ వరాల వర్షం
కురిపించిందని, ఆర్టీసీకి ఇవ్వడానికి డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

గడువు అడిగినా ఇవ్వలేదు

పూర్తి వివరాలిచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలని కోరినా మీరు(హైకోర్టు) ఇవ్వలేదని ఏజీ చెప్పారు. ల్యాప్‌టాప్‌ క్లిక్‌ చేస్తే పూర్తి వివరాలు వచ్చే ఈ రోజుల్లో, ఆర్టీసీకి ఉన్న బకాయిల వివరాలు చెప్పడానికి రెండు రోజుల గడువు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.4,253 కోట్లు చెల్లించామని చెబుతున్నారని, అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండటాన్ని కూడా డబ్బు ఇచ్చినట్లుగా ఎలా చూపుతారని ప్రశ్నించింది. ఆర్టీసీకి ఎవరైనా అప్పు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని, ఆ అప్పుకు చెల్లించాల్సిన వడ్డీలో రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించదని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఆ రూ.850 కోట్లను ఆర్టీసీకి ఇచ్చినట్లు ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీసింది. అప్పుడెప్పుడో డబ్బులిచ్చి, 2018–19లో చెల్లించాల్సినవి కూడా చెల్లించేశామని ఎలా చెబుతారంది.

తూతూ మంత్రంగానే ఉన్నాయి

ఏజీ స్పందిస్తూ, కోర్టు అడిగిన వెంటనే ప్రజాహితం కోరి అధికారులు వివరాలు అందచేశారని చెప్పారు. తమ ముందుంచిన వివరాలు అస్పష్టంగా, తూతూ మంత్రంగా ఉన్నాయని, తాము లేవనెత్తిన అంశాలకు సూటిగా, స్పష్టంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదని కోర్టు ఆక్షేపించింది. 2013–2019 సంవత్సరాలకు ఆర్టీసీకి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఎంత? ప్రస్తుత కేటాయింపులు ఎంత? ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు..? ఎంత విడుదల చేయాలి? తదితర వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూనియన్ల ప్రధానమైన నాలుగు డిమాండ్ల పరిష్కారానికి అవస రమైన రూ.47 కోట్లను విడుదల చేస్తుందో లేదో కూడా తెలియచేయాలంది.

ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రభుత్వానివి

ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యతలు ఉంటాయని ఏజీ అన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల రూ.47 కోట్లను విడుదల చేసేందుకు టైం పడుతుందన్నారు. మాంద్యం కారణంగానే ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ.1.46 లక్షల కోట్లకు తగ్గించుకుందని, ఇప్పుడు వస్తున్న ఆదాయం విద్య, వైద్యం, సంక్షేమం వంటి రోజు వారీ అవసరాలకు సరిపోతుందని పేర్కొన్నారు. ఇన్ని ఇబ్బందులున్నా ఆర్టీసీకి బడ్జెట్‌లో కేటాయించిన రూ.550 కోట్లకుగాను రూ.425 కోట్లు చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్లను వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ధర్మాసనం పిట్ట కథ…

విచారణ  టైంలో హైకోర్టు ఒక పిట్ట కథ చెప్పింది. ‘‘మీకు నేను రూ.3 లక్షలు అప్పు ఉన్నా. మీ అమ్మాయి పెళ్లికి నేను అప్పుతో కలిపి రూ.5 లక్షలు చెల్లించాను. అప్పుపోను మిగిలిన రూ.2 లక్షలను ప్రేమతో ఇచ్చాను. అలాంటప్పుడు ఆ రూ.రెండు లక్షలను కానుక గానే అనుకుంటాం కదా? ఇప్పుడొచ్చి ఆ రెండు లక్షలు నాకు తిరిగి చెల్లించాల్సిందే అంటే ఎలా?’’అని ప్రశ్నించింది. ప్రభుత్వం తన కౌంటర్‌లో ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవని చెప్పలేదని, బకాయి ఇవ్వాలన్న ఆర్టీసీ డిమాండ్‌ను ఖండించలేదని ధర్మాసనం గుర్తు చేసింది.

రూ.4,253 కోట్లు ఇచ్చామని చెప్తున్నరు. అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంది. దాన్ని కూడా డబ్బు ఇచ్చినట్టుగా ఎట్లా చూపుతారు.

– హైకోర్టు