ట్రైబల్ జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏజెన్సీ డాక్టర్లకు 50% ఇన్సెంటివ్

ట్రైబల్ జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏజెన్సీ డాక్టర్లకు 50% ఇన్సెంటివ్
  •     బేసిక్ పేలో సగం అదనంగాఇవ్వాలని సర్కారు నిర్ణయం  
  •     ఏజెన్సీ ఏరియాల్లోని మెడికల్ కాలేజీల్లో తప్పనున్న ఫ్యాకల్టీ తిప్పలు 

హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పే లో 50 శాతం అదనంగా ఇన్సెంటివ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాల కొరత, ప్రైవేట్ ప్రాక్టీస్‌‌‌‌ కు కూడా అవకాశం లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు సీనియర్ డాక్టర్లు ఇష్టపడటంలేదు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి, కాలేజీలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం నెలకొంది. 

అందుకే, తక్షణమే ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన ప్రభుత్వం.. ఏళ్ల తరబడి పెండింగ్‌‌‌‌ లో ఉన్న ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అర్హత ఉన్న కాలేజీల వివరాలను వెంటనే పంపాలంటూ డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ట్రైబల్ జనాభా ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు నివేదికలు ఇవ్వాలని డీఎంఈ కోరారు. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 

ఈ 5 కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయా? లేదా? అనే విషయాన్ని వెంటనే ధ్రువీకరించి నివేదిక పంపాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్‌‌‌‌కు ఆదేశాలు వెళ్లాయి. కాలేజీల నుంచి వచ్చే రిపోర్టులను ప్రభుత్వానికి అందించనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సర్కారు ఆమోదించిన తర్వాత ఈ కాలేజీల ఫ్యాకల్టీకి 50 శాతం ఇన్సెంటివ్ వర్తించనుంది. 

ట్రైబల్ కాదు.. రిమోట్ ఏరియాలను తీసుకోవాలి: టీజీజీడీఏ 

సర్కారు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) భగ్గుమంటోంది. "రిమోట్ ఏరియాల్లో ఉన్న అన్ని కొత్త మెడికల్ కాలేజీలకు అలవెన్సులు ఇస్తామని గతంలో కేబినెట్ సబ్ కమిటీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కేవలం ట్రైబల్ ఏరియాలు అని చెప్పి సగం మందికి ఎగ్గొట్టడం సరికాదు" అని మండిపడింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న కష్టాలే మిగతా చోట్ల కూడా ఉన్నాయన్నారు. అందుకే ఈ 5 జిల్లాలతో పాటు.. అదే స్థాయి ఇబ్బందులు ఉన్న  అనేక జిల్లాలోని కాలేజీలను కూడా ఈ జాబితాలో చేర్చాలని విన్నవించింది.