జూనియర్ లెక్చరర్ల సర్వీస్‌‌ లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్

జూనియర్ లెక్చరర్ల సర్వీస్‌‌ లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రమోషన్ల ద్వారా డిగ్రీలో లెక్చరర్లుగా వచ్చిన వారందరికీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ లెక్చరర్లుగా చేసిన సర్వీసులో 50 శాతాన్ని కెరీర్ అడ్వాన్స్‌‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద యూజీసీ పే స్కేల్స్ (2006, 2016) వర్తింపజేసేందుకు పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా జీవో 21 రిలీజ్ చేశారు. జూనియర్ లెక్చరర్లుగా పనిచేసి, పదోన్నతిపై లేదా నేరుగా డిగ్రీ లెక్చరర్లుగా ఎంపికైన వారికి వారి పాత సర్వీసును లెక్కించడంలో ఇబ్బందులు ఉండేవి. 

యూజీసీ స్కేల్స్ పొందడంలో, పదోన్నతుల్లో సీనియారిటీ కోల్పోవాల్సి వచ్చేది. తాజా జీవో ప్రకారం.. జూనియర్ లెక్చరర్ కేటగిరీలో చేసిన సర్వీసులో 50 శాతాన్ని ఇకపై సీఏఎస్ ప్రయోజనాల కోసం లెక్కిస్తారు. కాగా,ఈ జీవోపై డిగ్రీ కాలేజీల జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి, డిగ్రీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గోపి హర్షం వ్యక్తం చేశారు. అయితే, సీఏఎస్ ప్రమోషన్లలో ప్రమోటీ డిగ్రీ లెక్చరర్లకు జేఎల్​ సర్వీస్ లెక్కిస్తున్నారని టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, బ్రిజేష్ కుమార్ అన్నారు. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.