కరోనా కాదు.. దాని తాత వచ్చినా తట్టుకోవడానికి రెడీ : హరీశ్‌‌రావు

కరోనా కాదు.. దాని తాత వచ్చినా తట్టుకోవడానికి రెడీ : హరీశ్‌‌రావు
  • రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్స్‌‌లు .. 
  • పేదల కోసం అందుబాటులోకి తెస్తం
  • అవయవాల మార్పిడిలో దేశంలోనే ముందున్నం
  • గాంధీ ఆసుపత్రిలో ఆర్గాన్ ట్రాన్స్‌‌ప్లాంట్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
  • వైద్యారోగ్య శాఖ పదేండ్ల ప్రగతి నివేదిక రిలీజ్ చేసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో ఎయిర్ అంబులెన్సులను ప్రవేశ పెట్టబోతున్నామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా హెలికాప్టర్ ద్వారా వారిని హాస్పిటల్స్‌‌కు తరలిస్తామని చెప్పారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌కే దక్కుతుందని తెలిపారు. హైదరాబాద్‌‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేండ్ల ప్రగతి నివేదికను హరీశ్ రావు విడుదల చేశారు. ఇదే వేదికగా 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్స్‌‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్ స్థాయి నుంచి అన్ని దవాఖానాల్లో ప్రగతి నివేదికను ప్రదర్శించాలని అధికారులకు సూచించామని.. తమ రిపోర్టును చూసి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పారు. ‘‘ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి తెలంగాణ వైద్యారోగ్య రంగం సన్నద్ధంగా ఉంది. కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా మొత్తం 50 వేల పడకలతో రెడీ అయింది. 119 నియోజకవర్గాల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ ముందు ఉందని కేంద్రం ఇటీవలే చెప్పింది” అని వివరించారు. గాంధీ ఆసుపత్రిలో 8వ ఫ్లోర్‌‌‌‌లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రతినెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారని వివరించారు. 

దేశానికి రోల్ మోడల్‌‌గా మారినం

ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేదని.. త్వరలో రెండో స్థానంలోకి చేరబోతున్నదని హరీశ్ రావు చెప్పారు. 9 ఏండ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేసుకున్నామని, మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ‘‘పదేండ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. గ్రామ స్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానలు, మండల స్థాయిలో పీహెచ్​సీ లు, నియోజకవర్గ స్థాయిలో 100 పడకల ఆసుపత్రులు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం, నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు, 4 వేల పడకలుగా నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం చేపట్టాం” అని వివరించారు.

నిమ్స్‌‌లో వారం పాటు ఉచితంగా గుండె ఆపరేషన్లు

నిమ్స్ లో సోమవారం నుంచి వారం రోజులపాటు బ్రిటన్​కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నదని హరీశ్‌‌రావు చెప్పారు. ఈ సందర్భంగా బ్రిటన్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.