బుద్ధవనానికి సరికొత్త శోభ!.. ప్రతి వారం వన్డే టూర్ ఏర్పాటు

బుద్ధవనానికి సరికొత్త శోభ!.. ప్రతి వారం వన్డే టూర్ ఏర్పాటు
  •     మహాబోధి సొసైటీకి 5 ఎకరాలు కేటాయింపు 
  •     వెడ్డింగ్ డెస్టినేషన్, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణం 
  •     అభివృద్ధి, ఆదాయం పెంపు కోసం పర్యాటక శాఖ ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: బుద్ధవనం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రం కాదు..  ప్రపంచ పర్యాటక చిత్రపటంలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకుంటున్న దివ్య ధామం. బుద్ధవనంలో  ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి బౌద్ధులను ఆకర్షిస్తోంది. థాయ్‌‌లాండ్, శ్రీలంక, జపాన్, మయన్మార్ తోపాటు పాశ్చాత్య దేశాల నుంచీ బౌద్ధ భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. బుద్ధుడి బోధనల స్ఫూర్తితో నిర్మించిన ఈ వనం.. ధ్యానానికి, ఆధ్యాత్మిక వికాసానికి అనువైన ప్రదేశంగా రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ బుద్ధవానికి ప్రతి వారం ఒక రోజు టూర్  ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.  దీంతో పర్యాటక శాఖకు ఆదాయం సమకూరడంతో పాటు స్థానికులకు ఉపాధి లభించనున్నది. 

ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్  సమీపంలోని నందికొండ హిల్స్  కాలనీలో అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం ఉంది.  బుద్ధవనానికి మొత్తం 274 ఎకరాలు కేటాయించగా.. అందులోని 90 ఎకరాల్లో ప్రపంచ దేశాలను ఆకర్షించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. బుద్ధ చరితవనం, జాతకవనం (బోధిసత్వ పార్‌‌), 
ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూపం, బుద్ధిజం టీచింగ్‌‌  అండ్‌‌  ఎడ్యుకేషన్‌‌  సెంటర్‌‌,  హాస్పిటాలిటీ, వెల్ నెస్​ సెంటర్లను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్తూపాల నమూనాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్తూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించారు. రెండు వేల ఏళ్ల క్రితం ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశంగా ఆయన స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, బౌద్ధమత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టును రూపుదిద్దారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతం గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల అని అధికారులు చెబుతున్నారు. 

మహాబోధి సొసైటీకి పదెకరాలు 

బౌద్ధులు ఎక్కువగా  శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, చైనా, తైవాన్, హాంగ్ కాంగ్, దక్షిణ కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, నేపాల్ లో ఉన్నారు. దాదాపు పది దేశాల నుంచి బౌద్ధులు ఇక్కడి కి వస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహాబోధి సొసైటీకి 10 ఎకరాలు, పోగ్వాంగ్ సాంగ్ ప్రాన్స్ -తైవాన్​కు చెందిన సంస్థకు ఐదెకరాలను కేటాయించింది. ఈ సంస్థలు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 14 ఎకరాల్లో అభివృద్ధి పనులకు అగ్రిమెంట్  చేసుకున్నారు. వెడ్డింగ్ డిస్టినేషన్​ తో పాటు కన్వెన్షన్ సెంటర్, వెల్ నెస్ సెంటర్లు, టూరిస్టులకు వసతి సౌకర్యం కోసం స్టార్ హోటల్స్ నిర్మించనున్నారు.

బుద్ధవనంలో 8 పార్కులు.. 

స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు శిల్పాలు చెక్కారు. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులు నిర్మించారు. మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు, రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు, మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు, నాలుగోది ప్రపంచ స్తూపాల పార్కు, ఐదో పార్కులో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమ, ఆరో పార్కులో ధ్యానవనం, ఏడో పార్కులో మహాస్తూపం, ఎనిమిదో పార్కులో స్తూపవనం ఏర్పాటు చేశారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉండడంతో ఈ పార్కులో 22 రకాల చెట్లను పెంచుతున్నారు.