సీఎం పర్యటన పూర్తయిన కొద్దిసేపటికే నిర్ణయం

సీఎం పర్యటన పూర్తయిన కొద్దిసేపటికే నిర్ణయం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీఎం కేసీఆర్​ఖమ్మం జిల్లా పర్యటన పూర్తయిన కొద్ది గంటల్లోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి వర్గానికి ప్రభుత్వం షాక్​ఇచ్చింది. ఆయన వర్గానికి చెందిన జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్​సీనియర్​ లీడర్​డాక్టర్​ తెల్లం వెంకట్రావ్​లకు కేటాయించిన గన్​మెన్లను గురువారం తొలగించింది. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 4+4 గన్​మెన్లు ఉండే వారు. మాజీగా మారిన తర్వాత 2+2 గన్​మెన్లను ఇచ్చారు. జడ్పీ చైర్మన్​గా ఎన్నికైన తర్వాత 3+3 గన్​మెన్లు ఉండాల్సి ఉంది. కానీ 2+2 గన్​మెన్లతోనే సరిపెట్టారు. గురువారం సీఎం పర్యటన తర్వాత ఎటువంటి సమాచారం లేకుండానే 2+2 గన్​మెన్లను 1+1గా చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోరం వారు కూడా వద్దని తిరిగి పంపించేశారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు 1+1 గన్​మెన్లు ఉండగా, మొత్తానికే తొలగించారు. బీఆర్ఎస్​సీనియర్​లీడర్, గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్​తెల్లం వెంకట్రావ్​కు కూడా 1+1 ఉండేవారు. ఈయనకు కూడా పూర్తిగా తొలగించారు. ఈయన గురువారం భద్రాచలంలో మీడియా సమావేశం పెట్టి తాను పొంగులేటి వెంటే నడుస్తానన్న కొద్దిసేపటికే  గన్​మెన్లను తొలగిస్తున్నట్లు  ఉత్తర్వులు వెలువడ్డాయి.  ప్రస్తుతం గన్​మెన్లు లేని నేతలంతా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగే వారే. పొంగులేటికి ఆరు నెలల కిందటే 4+4 గన్​మెన్లు ఉండగా 2+2 చేశారు. ప్రస్తుతం దీన్నే కొనసాగిస్తున్నారు.

కక్ష సాధిస్తున్నరు  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు నేతల ఆదేశాల మేరకే తన గన్​మెన్లను కుదించారని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆరోపించారు. ఈ గన్​మెన్లు కూడా తనకు అవసరం లేదని వెనక్కి పంపించానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలకు గన్​మెన్లను ఉంచిన ప్రభుత్వం తాము పొంగులేటితో తిరుగుతున్నామనే కక్ష గట్టి తొలగించిందని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాపోయారు. తమకు గన్​మెన్లు లేకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటామన్నారు.