రుణమాఫీకి రూ.18,241కోట్లు.. బీఆర్వోను రిలీజ్ చేసిన సర్కారు

రుణమాఫీకి రూ.18,241కోట్లు..  బీఆర్వోను రిలీజ్ చేసిన సర్కారు
  • ముందుగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య 
  • పంట రుణాలు మాఫీ రూ.237.85 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు:  రుణమాఫీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.18,241 కోట్లకు బీఆర్వో (బడ్జెట్‌‌ రిలీజ్ ఆర్డర్‌‌‌‌)ను విడుదల చేసింది. ముందుగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.237.85 కోట్లను రిలీజ్ చేసింది. దీంతో 62,758 మంది రైతుల‌‌కు ల‌‌బ్ధి చేకూరుతుందని పేర్కొంది. అయితే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు టైం పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గతంలో సర్కారు చెప్పింది. ఇప్పటికి రూ.36 వేల వరకు బకాయిలను విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన మాఫీ సొమ్మును విడుదల చేస్తోంది. 

ప్రస్తుతం రూ.19 వేల కోట్ల మేర రుణమాఫీ బాకీ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) ను 30 ఏండ్లకు లీజుకు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు రూ.7,300 కోట్లను కంపెనీ చెల్లించాల్సి ఉన్నది. ఇప్పుడు ఈ మొత్తం ప్రభుత్వానికి చేరిందని, అందులో నుంచే రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలిసింది. రుణమాఫీకి రూ.18,241 కోట్లు రిలీజ్ చేసి.. తమ హామీని పూర్తి చేస్తున్నామని మంత్రి హరీశ్​రావు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 45 రోజుల్లో మాఫీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.