
- జులైలోనే మున్సిపల్ ఎన్నికలన్న సీఎం కేసీఆర్
- మరో 5 నెలలు కావాలన్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి
- సీఎం ప్రకటించిన రోజే హైకోర్టు లో అఫిడవిట్
- మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై గందరగోళం
‘‘మున్సిపల్ ఎన్నికలు ఒక్కటే మిగిలాయి. పది, పదిహేను రోజుల్లో బీసీ రిజర్వేషన్లు, ఇతర రిజర్వేషన్లు పూర్తయితే జులైలోనే ఎన్నికలు నిర్వహించొచ్చు’’.. ఇదీ మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.
‘‘మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు కనీసం 151 రోజులు (5 నెలలు) అయినా పడుతుంది. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనం, మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన పంచాయతీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారుకు కనీసం ఆ టైంనా కావాలి”.. ఇదీ అదే రోజు హైకోర్టులో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి (పీఎస్) అరవింద్ కుమార్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్.
హైదరాబాద్, వెలుగు: ఒకే రోజు మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు ప్రకటనలు ఇప్పుడు గందరగోళంలో పడేశాయి. నిజానికి జులై 2తో పాత మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు తీరనుంది. దీంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో రెండు సార్లు సర్కారుకు లేఖ రాసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం కూడా మరో రెండు పిటిషన్లు వేసింది. ఆ రెండు పిటిషన్లు రెండు సార్లు విచారించిన హైకోర్టు.. ఏదైంది రెండు వారాల్లో తేల్చాలని సర్కారును ఆదేశించింది. 24కు విచారణను వాయిదా వేసింది. దీంతో 18న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. పాలకవర్గాల గడువు ముగుస్తున్నందున అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుందని అందులో పేర్కొన్నారు. ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలకు మరో రెండు నెలలైనా టైం పట్టే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో కలిపి 73 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లున్నాయి. 69 మున్సిపాలిటీల పదవీ కాలం జులై 3తో పూర్తవుతుంది. మరోవైపు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. కొన్ని శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపారు. నగర పంచాయతీల స్థానంలో కొత్త మున్సిపాలిటీలు పెట్టారు. దీంతో మున్సిపాలిటీలు 151కి పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్లు మినహా, మిగిలిన మున్సిపాలిటీలకు జులై 3తో పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత వార్డుల విభజన, ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కలిసిపోయిన గ్రామాలను వార్డులుగా విభజించే ప్రక్రియకే సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దానికి మరో నెలైనా పడుతుందని అధికారులు అంటున్నారు. అందుకే ఎన్నికలకు మరో 5 నెలలైనా గడువు కావాలంటూ సర్కార్ అఫిడవిట్ వేసినట్టు తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలకు ముందే 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో బీసీ గణనను చేశారు. ఇప్పుడు వార్డులను విభజిస్తే, వార్డులు, చైర్మన్ల వారీగా రిజర్వేషన్లను త్వరలోనే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్పెషల్ ఆఫీసర్ల పాలన
ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీల్లోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. తాజాగా జులైలో పదవీకాలం ముగిసే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకూ స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల బాధ్యతను ఆర్డీవో, సబ్కలెక్టర్లకు, కార్పొరేషన్ల బాధ్యత ఐఏఎస్‌లకు అప్పగించనున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, సుప్రీం కోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్ల పరిమితి, రెండు సార్లు రిజర్వేషన్ల కొనసాగింపు, మహిళలకు సగం రిజర్వేషన్లు, చైర్మన్ల రిజర్వేషన్లను కొత్త చట్టంలో పొందుపరిచింది. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపు, వార్డుల విభజన, ఓటరు జాబితా రూపకల్పనపై మున్సిపల్ కమిషనర్లకు హైదరాబాద్‌లో గురువారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు