
న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసులో ఏ4గా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ ను ప్రాథమిక దశలోనే హైకోర్టు క్వాష్ చేసిందని, మధ్యంతర రక్షణ కల్పించిందని సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ కేసులో కీలకమైన ఆయనను విచారించేందుకు అనుమతివ్వాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై వాదనలు ముగించిన సీజేఐ ధర్మాసనం... తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పై 2016లో నమోదైన ఎఫ్ ఐఆర్ ను అప్పట్లోనే తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అదే ఏడాది జులై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్ సన్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి, ప్రతివాది మత్తయ్య తరఫున ప్రియాంక ప్రకాశ్, ఇతర న్యాయవాదులు హాజరయ్యారు. తొలుత మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో చార్జ్ షీట్‌ను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని నివేదించారు. అలాగే మత్తయ్య కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను విచారించేందుకు అవకాశం దక్కలేదని తెలిపారు.