
త్వరలోనే ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ట్యాంక్ బండ్ పరిసరాల్లో తొలి స్టాల్.. దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు
తెలంగాణ వంటకాలనూ అందుబాటులో ఉంచే యోచన.. నీరా పాలసీ విడుదల
హైదరాబాద్, వెలుగు:
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నీరా స్టాల్స్ ప్రారంభిస్తామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. తొలిస్టాల్‌ను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో కలిసి నీరా పాలసీ గైడ్‌లైన్స్ జీవోను శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. తర్వాత మాట్లాడారు. నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నారు. నీరా గీయడం, విక్రయం కేవలం గౌడ కులస్తులే చేయాలన్న సీఎం సూచనల మేరకు ఆ కులస్తులకే స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. స్టాళ్ల వద్ద తెలంగాణ వంటకాలను అందుబాటులో ఉంచాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దశలవారీగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరా ప్రారంభిస్తామని చెప్పారు.
కల్లును తిరిగి తెచ్చినం..
కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, అమెరికా దేశాలు, కేరళ, మహారాష్ట్రల్లో నీరా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతోందని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. నీరా స్టాల్స్‌తో గౌడ కులస్తులకు ఉపాధి లభించడంతోపాటు ప్రజలకు సహజసిద్ధమైన డ్రింక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 70 ఏండ్లుగా ఏ ప్రభుత్వమూ చేయనట్టుగా తమ సర్కారు గౌడ కులస్తులకు చేయూత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కల్లును నిషేధిస్తే.. తాము తిరిగి తీసుకొచ్చామని చెప్పారు. నీరా పాలసీ తెచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు గౌడ కులస్తుల తరఫున శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకనంద గౌడ్, మహిపాల్ రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, స్పెషల్ సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జీవోలోని అంశాలివీ..
లైసెన్స్ లేకుండా నీరా ఉత్పత్తికి వీలులేదు.
నీరా స్టాల్ పెట్టుకోవడానికి ఫార్మ్(1)పై రూ.10 విలువైన కోర్టు ఫీజు స్టాంప్ అతికించి ఎక్సైజ్‌శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.
గౌడ, ఈడిగ కులస్తులకు మాత్రమే నీరా గీసేందుకు, స్టాల్స్ పెట్టుకునేందుకు లైసెన్స్‌లు ఇస్తారు.
పదేండ్ల వ్యాలిడిటీతో లైసెన్స్ ఇస్తారు. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి.
నీరా లైసెన్స్‌తో కల్లు కాంపౌండ్‌లు నిర్వహించడానికి వీలు లేదు
రాష్ట్ర ఖాదీ, ఇండస్ట్రీస్ బోర్డు కింద ఉన్న పరిశ్రమలకు నీరా అమ్ముకోవచ్చు.
పర్యాటక ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నీరా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.
నీరా నుంచి తాటి బెల్లం, తాటి చక్కెర, ఇతర ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నీరా ఉత్పత్తులను కల్తీ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు.
నీరా స్టాల్స్‌లో, ఆరోగ్యానికి హానిచేసే ఇతర ఉత్పత్తులు అమ్మరాదు.
చెట్ల కేటాయింపులో ఎక్సైజ్, గీత కార్మిక సొసైటీ నిబంధనలు వర్తిస్తాయి.
లైసెన్స్ పొందిన వ్యక్తి మాత్రమే స్టాల్స్ నిర్వహించాలి. లైసెన్స్ ఇంకొకరికి బదిలి చేయడానికిగానీ, ఒకరి పేరుపై తీసుకుని మరొకరు స్టాల్ నిర్వహించడానికిగానీ వీల్లేదు.