యాదాద్రి టెంపుల్ పనులు స్పీడప్

యాదాద్రి టెంపుల్ పనులు స్పీడప్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి నరసింహస్వామి మెయిన్ టెంపుల్ పునఃప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఆఫీసర్లు పనులను స్పీడప్​చేశారు. సప్త తల మహారాజ గోపురానికి(పశ్చిమ రాజగోపురం) కలశాలు బిగించేందుకు సోమవారం స్కఫోల్డింగ్(పరంజా) పనులకు ముందు ఆలయ అర్చకులు, ఆలయ స్తపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొని పనులను ప్రారంభించారు. ఆలయానికి నాలుగు వైపులా 4 పంచతల రాజగోపురాలు ఏర్పాటు చేయగా, పశ్చిమ వైపున సప్త తల రాజగోపురాన్ని(ఏడంతస్తుల రాజగోపురం) ఏర్పాటు చేశారు. ‌‌‌‌అన్ని రాజగోపురాలపైనా పంచలోహాలతో తయారుచేసిన బంగారు పూతగల కలశాలను బిగించనున్నారు. మొదటగా సప్తతల రాజగోపురానికి కలశాలను అమర్చనున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్కఫోల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సప్తతల రాజగోపురంపైన 11 కలశాలు, పంచతల రాజగోపురాలపైన 9 కలశాలు ఏర్పాటు చేయనున్నట్లు వైటీడీఏ(యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్​మెంట్ అథారిటీ) ఆఫీసర్లు తెలిపారు. అలాగే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్టలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తూర్పు రాజగోపుర నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.18లక్షల85వేల439 ఆదాయం వచ్చిందని, అందులో ప్రసాదం ద్వారా రూ.7,72,050 ఇన్ కం వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు.