Telangana Global Summit :అథితులకు జ్ఞాపికగా కరీంనగర్ ఫిలిగ్రీ

Telangana Global Summit :అథితులకు జ్ఞాపికగా కరీంనగర్ ఫిలిగ్రీ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సుకు అధికార యంత్రాంగం అంతర్జాతీయ స్థాయిలో  ఏర్పాట్లు చేసింది. 

జ్ఞాపికగా కరీంనగర్ ఫిలిగ్రీ

సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే జ్ఞాపికలు అత్యంత విలువైనవిగా నిలవనున్నాయి. కరీంనగర్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘సిల్వర్ ఫిలిగ్రీ’ కళాఖండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని వెండి ప్రతిమను ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించారు. సుమారు 100 మంది కళాకారులు, 10 రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి ఈ అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దారు. సన్నని వెండి తీగలతో అల్లిన ఈ కళాకృతులు విదేశీ అతిథులకు అందించనున్నారు. ఇక.. బహుమతుల బుట్టలో సిల్వర్ ఫిలిగ్రీతో పాటు తెలంగాణ చేనేత వైభవానికి ప్రతీకలైన పోచంపల్లి ఇక్కత్ శాలువాలు, చేర్యాల పెయింటింగ్స్, ప్రసిద్ధ హైదరాబాదీ అత్తర్, ముత్యాల ఆభరణాలను పొందుపరిచారు. వీటితో పాటు నోరూరించే తెలంగాణ పిండివంటలైన సకినాలు, చెక్కలు, ఇప్పపువ్వు లడ్డు, నువ్వుల ఉండలు, బాదం-కీ-జాలి, మక్క పేలాలతో కూడిన ప్రత్యేక బాస్కెట్‌‌‌‌‌‌‌‌ను కూడా అతిథులకు అందజేయనున్నారు.

ఒగ్గుడోలు, పేరిణి శివతాండవం ప్రదర్శన

సబ్జెక్టులపై చర్చల తర్వాత విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి అతిథులను అలరించనుంది. అలాగే తెలంగాణ మట్టి వాసనలు వెదజల్లేలా కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డోలు, పేరిణి శివతాండవం వంటి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. బోనాల జాతర వైభవాన్ని కండ్లకు కట్టేలా కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిధులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు చెప్తున్నారు.