
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తూ ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నా ఒకేసారి అన్ని బస్సులు రోడ్ల మీదికి వచ్చే చాన్స్ లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. దశలవారీగా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. అన్ని బస్సులకు పర్మిట్ ఇస్తే అనేక సమస్యలు వస్తాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకని ముందుగా కొన్ని ప్రైవేటు బస్సులకు, అటు తర్వాత పరిస్థితిని అంచనా వేసి మరికొన్ని ప్రైవేటు బస్సులకు స్టేజ్ క్యారియర్‌గా పర్మిట్ ఇవ్వాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏ రూట్లల్లో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలో ట్రాన్స్ పోర్టు అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారు. దాన్ని సీఎం అనుమతి కోసం పంపారు. సీఎం ఆమోదం తెలుపగానే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ రెండు మూడురోజుల్లో పూర్తయ్యే చాన్స్ఉంది. ‘‘మొదటి దశలో సుమారు 1,200 బస్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేశాం. రెండు మూడు నెలల పాటు ఆ ప్రైవేటు బస్సుల పనితీరు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాక మిగతా వాటి కోసం నోటిఫికేషన్ ఇస్తాం’’ అని ఓ అధికారి చెప్పారు. గంపగుత్తగా ప్రైవేటు బస్సులకు పర్మిట్ ఇచ్చి విఫలమైతే అటు రాజకీయంగా ఇటు ప్రజల్లో విమర్శలు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు ప్రైవేటు బస్సులు కాంట్రాక్ట్ క్యారియర్ గా మాత్రమే తిరుగుతున్నాయి. స్టేజీ క్యారియర్ గా ఆర్టీసీ బస్సులు మాత్రమే తిరుగుతున్నాయి. స్టేజీ క్యారియర్ గా ప్రైవేటు బస్సులు తిరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయన్నది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అందుకని కొన్ని ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారియర్‌గా అనుమతి ఇచ్చి వాటి పనితీరు చూశాక మిగతా వాటికి అనుమతి ఇస్తే బాగుంటుదని ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
రవాణా శాఖ కమిషనర్‌తో కమిటీ
ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చే ప్రక్రియ అంతా ట్రాన్స్ పోర్టు కమిషనర్ నేతృత్వంలో జరుగనుంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు అధికారులు ఆ కమిటీ లో ఉండనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక దరఖాస్తు చేసుకున్న కంపెనీల పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉంది. ఎన్ని ఏండ్లుగా బస్సులు నడిపిస్తున్నారు? ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు? ఆ కంపెనీల బస్సులు ఏమైనా ప్రమాదాలు ఎదుర్కొన్నాయా? అనే విషయాలను పూర్తిగా పరిశీలిస్తామని రవాణా శాఖలోని ఓ అధికారి చెప్పారు. అదే సమయంలో ఆ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేకంగా పరిశీలించాకనే అనుమతి ఇస్తామని అన్నారు. ప్రైవేటు బస్సులు నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని సంస్థలు ఇక్కడి అధికారులను సంప్రదిస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలకు చెందిన సంస్థలకు అనుమతి ఇవ్వాలా లేదా అనే విషయంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలకు అనుమతి ఇస్తే ఏమైనా విమర్శలు వస్తాయా అనే కోణంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
ముందుగా అద్దె బస్సులకు అనుమతి?
ఆర్టీసీలో 2,100 అద్దె బస్సులు ఉన్నాయి. వాటితోపాటు మొత్తం 5,100 బస్సులను ప్రైవేటు బస్సులుగా తిప్పుకునేందుకు అనుమతి ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. కొన్ని బస్సులకు ప్రైవేటు అనుమతి ఇచ్చి వాటి పనితీరు చూశాక మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చే చాన్స్ కూడా ఉందని ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం అద్దె బస్సులు ఏ రూట్లలో తిరుగుతున్నాయో అదే రూట్లలో వాటిని అద్దెకు కాకుండా ప్రైవేటు బస్సులుగా తిప్పేందుకు రూట్ పర్మిషన్ ఇవ్వనున్నారు. సమ్మె సమయంలోనే సుమారు 1,300 అద్దె బస్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం అద్దె బస్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ముందుగా ప్రైవేటు బస్సులుగా అనుమతి ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.