- మార్నింగ్ టిఫిన్.. ఈవెనింగ్ స్నాక్స్
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్లాన్
- సూత్రప్రాయంగా సీఎం రేవంత్ అంగీకారం
- ప్రతిపాదనలు రెడీ చేసిన ఇంటర్మీడియెట్ కమిషనరేట్
హైదరాబాద్, వెలుగు: సర్కారు కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూత్రపాయంగా అంగీకరించడంతో సమగ్రమైన ప్రతిపాదనలను ఇంటర్మీడియెట్ అధికారులు ప్రారంభించారు. ఒక్కో విద్యార్థిపై రూ.27 వెచ్చిస్తూ, ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకునేలా ప్రపోజల్స్ రెడీ చేశారు.
స్టేట్ వైడ్ గా 430 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉండగా, ప్రస్తుతం 1,72,557 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో ఫస్టియర్‌లో 91,791 మంది, సెకండియర్ లో 80,766 మంది చదువుతున్నారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 11 వేల కొత్త అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం కూడా పలు సంస్కరణలు చేపడుతుండటంతో అడ్మిషన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
దీనికి అనుగుణంగా సుమారు 2 లక్షల మంది వరకూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే 393 సర్కారు కాలేజీలు ఓఆర్ఆర్ బయట ఉండగా, ఎక్కువగా రూరల్ ఏరియాల్లోనే ఉన్నాయి. వీటిలో చదివే వారంతా దాదాపు పేద విద్యార్థులే కావడంతో.. వారందరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంట్లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం మిడ్డే మీల్స్ అందించాలని యోచిస్తోంది.
టిఫిన్, మీల్స్, స్నాక్స్...
ఈ విద్యా సంవత్సరం సర్కారు కాలేజీల్లోని పిల్లలకు కేవలం మిడ్డే మీల్స్ అందించాలని ఇంటర్ కమిషనరేట్ అధికారులు సర్కారు పంపించారు. దానిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన విద్యా శాఖ రివ్యూ మీటింగ్ లో దీనికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే స్కూల్ విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకూ టిఫిన్స్, స్నాక్స్ అందించాలన్న అంశంపై చర్చించినట్టు తెలిసింది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటర్మీడియెట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాధారణంగా విద్యా సంవత్సరంలో 225 పనిదినాలు ఉంటాయి. అయితే పరీక్షలు, ఇతర సెలవు దినాల్లోనూ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అదనంగా మరో 25 రోజులు కలిపి.. మొత్తం 250 రోజుల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఒక్కో విద్యార్థిపై రూ. 27 ఖర్చు
ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.27 చొప్పున వెచ్చించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.235 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం బడుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తూ సమగ్ర శిక్ష స్కీము ద్వారా అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిధులు 8వ తరగతి వరకే వర్తిస్తాయి. 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు కూడా అల్పాహారం, భోజనానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే భరించేలా అధికారులు తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. సాయంత్రం ఇచ్చే స్నాక్స్‌కు మాత్రం సమగ్ర శిక్ష నిధులు వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ స్కీమ్ అమలైతే సర్కారు కాలేజీల్లో డ్రాపౌట్స్ తగ్గి అడ్మిషన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
