త్వరలో రైతు బంధు పైసలు

త్వరలో రైతు బంధు పైసలు
  •     ఫండ్స్ విడుదల చేయాలని సీఎం ఆదేశాలు
  •     కసరత్తు చేస్తున్న ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌  

హైదరాబాద్, వెలుగు: రైతు బంధు స్కీమ్ కింద రైతుల అకౌంట్లలో పైసలు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎకరానికి రూ.5 వేల చొప్పున దాదాపు కోటిన్నర ఎకరాలకు రూ. 7,500 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిధుల సర్దుబాటుపై ఫైనాన్స్ డిపార్ట్‌‌మెంట్ ఇప్పటికే దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నెల 15 నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జూన్‌‌‌‌‌‌‌‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం కింద రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోట్ల ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరం ఉంటుందని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. గత వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో మొదటి రోజు ఒక ఎకరందాకా భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి, ఆ తర్వాత ఇతరులకు నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.