కలగానే వర్కర్ టు ఓనర్ స్కీం

కలగానే వర్కర్ టు ఓనర్ స్కీం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్కర్​టు ఓనర్​పథకం కలగా మారింది. ఆరేండ్లుగా నేత కార్మికులకు ఎదురుచూపులే మిగిలాయి. వర్కర్​టు ఓనర్​పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీవింగ్ పార్క్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. 2017 అక్టోబర్ 11న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ శివారులో 88.3 ఎకరాల్లో  రూ. 220 కోట్లతో టీఎస్ఐఐసీ వీవింగ్ పార్క్​నిర్మాణాన్ని చేపట్టింది. ఆరేండ్లు గడుస్తున్నా నేటికీ పనులు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం రేకుల షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. బయట పనులు పూర్తయ్యాక లోపల వీవింగ్ మెషిన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలను ఏర్పాటు చేసి మోడ్రన్ టెక్నాలజీతో వేగంగా,  నాణ్యతతో కూడిన వస్త్రోత్పత్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్క్ లో వీవింగ్ షెడ్లను నిర్మించే దశలో రెండు లైన్లను ఏర్పాటు చేశారు. ఒక వరుస షెడ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో వరుస షెడ్ల నిర్మాణం ఇంకా మొదలు కాలేదు. దీంతో పనులు ఇంకా ఎన్నాళ్లు సాగుతాయోననే అయోమయం నెలకొంది. 

వర్కర్ టు ఓనర్ అంటే..

వర్కర్ టు ఓనర్ పథకం అంటే కార్మికులే యజమానులుగా మారి వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు. ఈ పథకం అమలులోకి వస్తే సిరిసిల్లలో దాదాపు పది వేల మంది కార్మికులు ఓనర్లుగా మారతారు. పథకంలో భాగంగా ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుంది. 40 శాతం బ్యాంక్ లోన్ ఇస్తారు. మిగతా పది శాతం కార్మికుడు చెల్లించాలి. ఒక్కో కార్మికుడికి యూనిట్ కింద రూ. 8 లక్షలు విలువ చేసే నాలుగు ఆధునిక మరమగ్గాలను సమకూరుస్తారు. ఒక్కో షెడ్డులో 8 మంది కార్మికులకు యూనిట్లు కేటాయిస్తారు. ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి చేసేందుకు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తారు. సిరిసిల్లలో ప్రస్తుతం 30,352 మరమగ్గాలు ఉన్నాయి. వీటిలో 4 వేల నుంచి 6 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. అదే వీవింగ్ పార్క్ లో అయితే డైయింగ్, వై పని, కండేలు చుట్టువారే ఇలా అనుబంధ రంగాల కార్మికులు కూడా ఉపాధి పొందుతారు.   

కేటీఆర్​ చెప్పినా.. 

పెద్దూర్ శివారులోని రగుడు బైపాస్ రోడ్ లో నిర్మిస్తున్న వీవింగ్ పార్క్ పనులు నత్తను తలపిస్తున్నాయి. ఆరేండ్లగా పనులు సాగుతూనే ఉన్నాయి. వీవింగ్ పార్క్ నిర్మాణ పనులపై గతంలో పలుసార్లు ఐటీ మినిస్టర్ కేటీఆర్ రివ్యూ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ పనులను పర్యవేక్షిస్తూ రివ్యూ చేయాల్సిన ఉన్నతాధికారులు మిన్నుకుండిపోతున్నారు. దీంతో వర్కర్ ను ఓనర్ పథకం కార్మికులకు ఆమడ దూరంలోనే ఉంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో కార్మికులుగా పని చేస్తున్న  నేతన్నలు వర్కర్ టు ఓనర్ పథకం ఎప్పుడు అమలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. పనులు త్వరగా కంప్లీట్ చేసి కార్మికులను ఓనర్లను చేయాలని కోరుతున్నారు. 

ఓనరయ్యేందుకు ఎదురు చూస్తున్నా

వర్కర్ టు ఓనర్ పథకంలో భాగంగా ఓనరయ్యేందుకు ఎదురుచూస్తున్నా. వర్కర్ టు ఓనర్ పథకం అమలైతే నాలాంటి చాలామంది పేద కార్మికులకు స్వయం ఉపాధి లభిస్తుంది. వీవింగ్ పార్క్ పనులు త్వరగా కంప్లీట్ చేసి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి.
–గడ్డం నాగరాజు, పవర్​లూమ్​కార్మికుడు, సిరిసిల్ల 

ఈ ఏడాదే బెనిఫిషర్ల ఎంపిక

వీవింగ్ పార్క్​పనులు స్లోగా సాగుతున్నాయి. షెడ్ల నిర్మాణ పనులు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది సమ్మర్ లో పనులు వేగం అందుకుంటాయి. షెడ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ ఏడాదే బెనిఫిషర్లను ఎంపిక చేస్తాం. ఇప్పటికే మోడల్ లూమ్స్ బిగించాం. వాటి ద్వారా పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి మరిన్ని లూమ్స్ బిగిస్తాం.
–అశోక్ రావు, డిప్యూటీ డైరెక్టర్, చేనేత జౌళి శాఖ