గ్రేహౌండ్స్ కు ఎండ్‌ కార్డ్!..మావోయిస్టుల ఏరివేత ముగియడంతో రద్దుకు సన్నాహాలు

గ్రేహౌండ్స్ కు ఎండ్‌ కార్డ్!..మావోయిస్టుల ఏరివేత ముగియడంతో రద్దుకు సన్నాహాలు
  •     కూంబింగ్‌ ఆపరేషన్లలో  గ్రేహౌండ్స్ కీ రోల్‌
  •     ప్రస్తుతం 24 యూనిట్లలో సుమారు 700 మంది సిబ్బంది
  •     80 శాతం సిబ్బందిని ఇతర విభాగాలకు తరలించేందుకు ఏర్పాట్లు
  •     డీజీపీ నేతృత్వంలో పోలీస్ ఉన్నతాధికారుల సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర గ్రేహౌండ్స్‌‌ ఇక ముగింపు దిశకు చేరింది. గత 36 ఏండ్ల కాలంగా అడవుల్లో ఆపరేషన్లు చేసిన గ్రే హౌండ్స్ పోలీసులు.. రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్, క్రైమ్ సహా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో గ్రేహౌండ్స్‌‌ అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. 

ప్రస్తుతం గ్రేహౌండ్స్‌‌లో విధులు నిర్వహిస్తున్న 650 నుంచి 700 మందిలో దాదాపు 80 శాతం మందిని వివిధ విభాగాల్లో నియమించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. అవసరాలకు తగ్గట్టుగా కేటాయింపులు జరుపుతూ.. గ్రేహౌండ్స్‌‌ విభాగాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. 

ఆపరేషన్స్‌‌లో ప్రతిభ కనబరిచిన పోలీసులను కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌లో వినియోగించనున్నట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేతల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌‌ గణపతి మరో ఐదుగురు మినహా కీలక నేతలు లొంగిపోవడంతో.. రాష్ట్రంలో మావోయిస్టులు దాదాపుగా అంతరించిపోయారు. దీంతో అడవుల్లో గ్రేహౌండ్స్‌‌ కూంబింగ్‌‌ ఆపరేషన్‌‌లు నిర్వహించే అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే గ్రేహౌండ్స్ రద్దుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది.

మొదట్లో 3 వేల మంది ప్రస్తుతం 700 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 37 ఏండ్ల క్రితం శ్రీకాకుళం అడవుల్లో నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత.. నక్సలైట్లను కట్టడి చేసేందుకు గ్రేహౌండ్స్‌‌కు రూపకల్పన జరిగింది. 1989లో నాటి ముఖ్యమంత్రి ఎన్‌‌టీ రామారావు, సీనియర్‌‌‌‌ ఐపీఎస్‌‌  కేఎస్‌‌ వ్యాస్‌‌ నేతృత్వంలో గ్రేహౌండ్స్‌‌ ఏర్పాటైంది. గ్రేహౌండ్స్‌‌ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌‌ శివారులోని ప్రేమావతిపేట, మంచిరేవులలో దాదాపు 500 ఎకరాల ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో మొదట్లో మూడు వేల మంది గ్రేహౌండ్స్‌‌ బలగాలు ఉండగా.. తెలంగాణ అవతరించిన తర్వాత ఆ సంఖ్య 1500 లకు చేరింది. ఈ క్రమంలోనే ఒక్కో యూనిట్‌‌కు 25 నుంచి 30 మంది చొప్పున 2022 వరకు 26 యూనిట్ల గ్రౌహౌండ్స్ పనిచేశాయి. కాగా, మావోయిస్టుల ప్రాభల్యం తగ్గడంతో 2024 నుంచి గ్రేహౌండ్స్‌‌లో నియామకాలు జరగలేదు. దీంతో ప్రస్తుతం 24 యూనిట్లలో 650 నుంచి 700 వరకు సిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలిసింది. 

మావోయిస్టుల ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్ సక్సెస్‌

తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో స్పెషల్ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌తో పాటు గ్రేహౌండ్స్ బలగాలు విశేషమైన కృషి చేశాయి. అజ్ఞాతంలో ఉన్న అగ్రనేతలు, కీలక సభ్యులు సహా మావోయిస్టు క్యాడర్‌ లొంగిపోయే విధంగా చర్చలు జరిపారు. కాగా, వరుస ఎన్‌కౌంటర్లు, కూంబింగ్‌, ఆపరేషన్ గ్రీన్ హంట్‌, ఆపరేషన్‌ కగార్‌‌ తో మావోయిస్టుల శకం అంతిమ దశకు చేరింది. 

ఇలా ఏటా మావోయిస్టుల సంఖ్య తగ్గుతున్న కొద్ది గ్రేహౌండ్స్‌లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. అడవుల్లో నక్సలైట్ల కోసం వేట, కూంబింగ్‌ జరిపేందుకు గ్రేహౌండ్స్ కమాండోలకు శిక్షణ ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిస్సా, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జరిగిన అనేక కూంబింగ్‌ ఆపరేషన్లలో రాష్ట్ర గ్రేహౌండ్స్‌ దళాలు పాల్గొన్నాయి. మావోయిస్టులు పూర్తిగా అంతరించడంతో గ్రేహౌండ్స్‌ సిబ్బందిని ఇతర విభాగాల్లో వినియోగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.