- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రస్తుతం మొత్తం తొమ్మిది కేంద్ర ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఉన్నట్టు ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి సమాధానంపై స్పందించిన ఎంపీ కావ్య, తెలంగాణకు కొత్త విద్యాసంస్థల కేటాయింపులో కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు.
తెలంగాణలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. ఒక్క వరంగల్‌లోనే 1.65 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారని తెలిపారు. వరంగల్ నిట్‌కు కేంద్రం కేటాయించిన రూ.64.38 కోట్లు ఏమాత్రం సరిపోవన్నారు. తెలంగాణకు కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు.
