అత్యున్న‌త పోలీసింగ్ వ్య‌వ‌స్థ తెలంగాణ‌లోనే

అత్యున్న‌త పోలీసింగ్ వ్య‌వ‌స్థ తెలంగాణ‌లోనే

హైదరాబాద్: సమాజంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు, పటిష్ఠతకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందని చేశారు అన్నారు.

తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్ లా స్కూల్, సైబర్ పీస్, ఐసాక్, ఎస్.సి.ఈ.ఆర్.టి, ఐసియా,యూనిసెఫ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో తదితర సంస్థల సహకారంతో ఈ సదస్సు ముగింపు సమావేశం జూమ్ ఆధారితంగా నిర్వహించారు. డీజీపీ. ఎం. మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డీ.జీ.పీ. మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా ఏ మేజర్ సంఘటన జరగకుండా చరిత్ర సృష్టించామని అన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే, సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక, సంక్షేమ, ఆర్థిక, మౌలిక రంగాల కల్పన రంగాలలో దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.

కోవిద్ – 19 నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం మహిళలు, పిల్లలతో పెరిగిందని, ఈ సందర్బంగా వీరు సైబర్ నేరాల బారిన పడకుండా సైబ్-హర్ పేరుతొ నెలరోజులపాటు చైతన్య కార్యక్రమాన్ని దేశంలోనే తెలంగాణా పోలీస్ మొట్టమొదటి సారిగా నిర్వహించిందని తెలియచేసారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తెలంగాణ పోలీస్ ముందంజలో ఉందని, సి.సి టీ.వీ లు అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే 16 వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. సి.సి టీవీ ల ద్వారా నేరాలను కేవలం 24 గంటలలోపే ఛేదిస్తున్నామని గుర్తు చేశారు. డయల్- 100 ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ కు కేవలం ఐదు నిమిషాలలోనే సంఘటనా స్థలానికి చేరుకుంటున్నామని తెలిపారు. నగరంలో నిర్మాణంలో ఉన్న కమాండ్ కంట్రోల్ టవర్ పూర్తవుతే నేరనియంత్రణలో అత్యాధునిక సౌకర్యాలున్న టవర్ గా దేశంలో మొట్ట మొదటిదిగా నిలుస్తుందని అన్నారు. అత్యున్నత జీవన ప్రామాణాలు కలిగిన సురక్షిత నగరాలలో హైదరాబాద్ గత ఐదేళ్లుగా అగ్ర స్థానంలో నిలవడానికి కారణం ఇక్కడి శాంతి, భద్రతల పరిరక్షణే కారణమని అన్నారు. ఈ సందర్బంగా సైబర్ నేరాలపై చైతన్యం కలిగించే పలు ప్రచార కిట్ లను డీ.జీ.పీ హహేందర్ రెడ్డి విడుదల చేశారు.