- హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గ్యాలంట్రీ అవార్డు
- ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
- 12 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్.. వీరిలో ఐజీ సుమతి
- ఫైర్, జైళ్లు, హోంగార్డ్ విభాగంలో మరో 8 మెడల్స్
- దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి అవార్డులు
న్యూఢిల్లీ, వెలుగు:గతణంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన మెడల్స్ లో తెలంగాణకు 23 దక్కాయి. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందించిన 15 మందిని పోలీస్ మెడల్స్ వరించాయి. ఒకరికి గ్యాలంట్రీ మెడల్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్, మరో 12 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన గ్యాలంట్రీ మెడల్ దక్కింది. ఏఎస్పీ మంద జీఎస్ ప్రకాశ్ రావు, ఎస్ఐ అన్ను దామోదర్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్ వచ్చాయి. ఐజీ బి.సుమతి, కమాండెంట్ పీవీ రాములు, డీఎస్పీ ఎం.శంకర్, సీనియర్ కమాండెంట్ ఎ.భానుమూర్తి, డీసీపీలు కేవీఎం ప్రసాద్, సి.వంశీ మోహన్ రెడ్డి, తుమ్మల లక్ష్మీ, ఎస్ఐలు బుర్ర ఎల్లయ్య, వి.పురుషోత్తం రెడ్డి, ఎస్.అబ్దుల్ కరీం, ఏఎస్ఐ బొడ్డు ఆనందం, హెడ్ కానిస్టేబుల్ పైలి మనోహర్‌కు మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. కాగా, పోలీస్, ఫైర్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, జైళ్ల శాఖలో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇందులో 125 గ్యాలంట్రీ, 101 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్స్, 756 మెరిటోయిస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.
ఫైర్ సర్వీసులో ముగ్గురికి..
ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో 3, హోంగార్డ్ విభాగంలో 3, జైళ్ల శాఖలో 2 చొప్పున మరో 8 మెడల్స్ మన పోలీసులకు దక్కాయి. ఫైర్ సర్వీసులో లీడింగ్ ఫైర్ ఫైటర్స్ సింగ్ ఘవేరీ రాజేందర్, హనుమంత రావు గౌతి, రవీందర్ కొలపురీకి పతకాలు వచ్చాయి. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ ఎం.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ జైలర్ అశోక్ కుమార్‌కు, హోంగార్డ్స్ విభాగంలో రవి మసరామ్, పి.జంగయ్య, బుర్రనొళ్ల రేణుకకు అవార్డులు దక్కాయి.
ప్రాణాలకు తెగించి పట్టుకున్నడు..
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గతేడాది గచ్చిబౌలి పబ్‌లో గన్‌తో ఎదురుదాడి చేసిన క్రిమినల్ ప్రభాకర్‌ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ అవార్డు ప్రకటించింది. ఆయన కాలికి గాయమైనా వదలకుండా ప్రాణాలకు తెగించి నేరుస్తుడిని పట్టుకున్నాడు. నానక్‌రామ్‌గూడకు చెందిన ప్రభాకర్ అలియాస్రాహుల్రెడ్డి మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్. ఇతడిపై తెలుగు రాష్ట్రాల్లో దాదాపు125కు పైగా కేసులు ఉన్నాయి. 2022లో విశాఖ సెంట్రల్ జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది గౌలిదొడ్డిలోని ‘ప్రిజం పబ్’కు ప్రభాకర్ వస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పట్టుకునేందుకు వెంకట్ రెడ్డితో పాటు ప్రదీప్ రెడ్డి , వీరాస్వామి వెళ్లారు. నిందితుడిని గుర్తించి లొంగిపోవాలని కోరగా ప్రభాకర్వారిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఫైరింగ్‌లో వెంకట్‌రెడ్డి ఎడమ కాలి బొటనవేలికి బుల్లెట్ తగిలింది. ఆయన రక్తమోడుతున్నా పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రభాకర్‌ను పట్టుకున్నాడు. వెంకట్ రెడ్డికి గ్యాలంట్రీ అవార్డు రావడంతో ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది ఆయనను అభినందించారు.
