వెలుగు ఓపెన్ పేజీ : కక్ష సాధింపులు లేని బిల్లును సెలెక్ట్ కమిటీ సిఫార్స్ చేయాలి

వెలుగు ఓపెన్ పేజీ :  కక్ష సాధింపులు లేని బిల్లును సెలెక్ట్ కమిటీ సిఫార్స్ చేయాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు–2026’ ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.  దీనిపై  విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, అసెంబ్లీ దీనిని సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ఒక మంచి పరిణామం.  ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం.  

భారత రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణ ప్రతి పౌరుడికి ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను ఈ చట్టం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 19(2) అధికరణ నిర్దేశించిన  ‘సహేతుకమైన నియంత్రణల’ పరిధిని దాటి, కార్యనిర్వాహక వ్యవస్థకు అపరిమిత అధికారాలను కట్టబెట్టడం ఆందోళనకరం.  రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950) కేసులో అత్యున్నత న్యాయస్థానం ఉద్ఘాటించినట్లు.. వాక్ స్వాతంత్య్రం హక్కుపై ఆంక్షలు  విధించేటప్పుడు  ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలి తప్ప,  పాలకుల రాజకీయ అవసరాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించ కూడదు. గతంలో సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్‌‌‌‌ను కొట్టివేస్తూ ‘అస్పష్టమైన చట్టాలు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తాయి’ అని స్పష్టం చేసింది.  ప్రస్తుత బిల్లులోని  విద్వేషపూరిత ప్రసంగ నిర్వచనం అదే అస్పష్టతకు నిలువుటద్దంలా ఉంది.  విరోధం,  ద్వేషంవంటి పదాలను  చట్టబద్ధంగా నిర్వచించకపోవడం వల్ల, అధికారులు తమ ఇష్టానుసారంగా ఈ చట్టాన్ని ప్రయోగించే ప్రమాదం ఉంది.    చర్చకు,  ప్రేరేపణకు మధ్య ఉన్న సన్నని గీతను ఈ చట్టం  తుడిచివేసింది.  ఏదైనా ప్రసంగాన్ని  నియంత్రించాలంటే, ఆ ప్రసంగానికి  శాంతి భద్రతల విఘాతానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలి. సూపరింటెండెంట్, సెంట్రల్ ప్రిజన్ వర్సెస్ రామ్ మనోహర్ లోహియా (1960) కేసులో కోర్టు పేర్కొన్నట్లు, కేవలం ఊహాజనితమైన అనుమానాలతో పౌరుల గొంతు నొక్కడం చట్టవిరుద్ధం.   చనిపోయిన వ్యక్తులపై చేసే విమర్శలను కూడా ఈ చట్ట పరిధిలోకి తేవడం విడ్డూరంగా అనిపిస్తుంది.  దీనివల్ల చారిత్రక విశ్లేషణలు,  సామాజిక పరిశోధనలు సైతం నేరాలుగా పరిగణించే దుస్థితి  ఏర్పడుతుంది. 

వ్యక్తిగత స్వేచ్ఛ, సహజ న్యాయ సూత్రాల విస్మరణ

శిక్షల నిబంధనలు గమనిస్తే, ఈ చట్టం నేర నివారణ కంటే ప్రతీకార ధోరణిని కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది.  మొదటి నేరానికే ఏడు ఏళ్ల కఠిన శిక్ష  విధించడం,   నేరం రుజువు కాకముందే నిరంతర  నేరస్తుడుగా ముద్ర వేయడం వంటివి రాజ్యాంగంలోని 21వ అధికరణం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయి. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు వివరించినట్లు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఏ చట్టమైనా  న్యాయబద్ధంగా,  నిష్పక్షపాతంగా ఉండాలి.  నిందితుడిని  నేరం నిరూపించేవరకు  నిర్దోషిగా  పరిగణించాలనే అంతర్జాతీయ ప్రమాణాలను ఈ చట్టం విస్మరించింది. వారెంట్ లేకుండా అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడం వంటి కఠిన నిబంధనలు పౌర సమాజాన్ని  భయభ్రాంతులకు  గురిచేస్తాయి. ఇది  రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా వాతావరణాన్ని విషతుల్యం చేస్తుంది.

పత్రికా స్వేచ్ఛకు సెన్సార్‌‌‌‌షిప్

సెక్షన్ 6 కింద  డిజిటల్  కంటెంట్‌‌‌‌ను నిలిపివేసే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. ఇండియన్ ఎక్స్‌‌‌‌ప్రెస్ న్యూస్‌‌‌‌పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1985) కేసులో పత్రికా స్వేచ్ఛ అనేది వాక్ స్వాతంత్య్రంలో అంతర్భాగమని  కోర్టు పేర్కొంది. పత్రికా రంగంపై భయానక ప్రభావాన్ని  చూపే చట్టాలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయి.  అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2020) కేసులో ఇంటర్నెట్ ప్రాప్తి కూడా ప్రాథమిక హక్కు అని,  దానిపై ఆంక్షలు కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే,  న్యాయ సమీక్షకు  లోబడి ఉండాలని  స్పష్టం చేశారు.  కానీ,  ప్రస్తుత చట్టం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా సమాచారాన్ని తొలగించే అధికారాన్ని కట్టబెట్టింది. ఇది పత్రికా స్వేచ్ఛను నిర్వీర్యం చేయడమే కాకుండా  సమాచార ప్రవాహాన్ని 
అడ్డుకుంటుంది. 

హైపర్ సెన్సిటివిటీ - భావజాల నియంత్రణ

ప్రభుత్వం చెబుతున్న ప్రజా ప్రయోజన మినహాయింపులు అత్యంత అస్పష్టంగా ఉన్నాయి. ఎస్. రంగరాజన్ వర్సెస్ పి. జగజీవన్ రామ్ (1989) కేసులో పేర్కొన్నట్లు.. ఒక అతిగా స్పందించే  వ్యక్తి  కోపగించుకున్నంత మాత్రాన ప్రసంగం  నేరం కాబోదు.  అది తక్షణ హింసకు దారితీసేలా ఉండాలి.  సామాన్య పౌరులు తమ మాటలు ప్రజా ప్రయోజనం కోసమేనని  నిరూపించుకోవాల్సి రావడం అన్యాయం.  రాజ్యాంగం ప్రకారం నేరాన్ని  నిరూపించాల్సిన బాధ్యత  ప్రాసిక్యూషన్‌‌‌‌పై  ఉండాలి.  కానీ  ఇక్కడ ఆ బాధ్యతను నిందితుడిపై వేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఈ చట్టంలోని నాల్గవ సెక్షన్ ద్వారా ఎగ్జిక్యూటివ్  మెజిస్ట్రేట్లకు కల్పించిన ముందస్తు నిర్బంధ అధికారాలు పౌర హక్కులకు పెనుముప్పు.   నేరం చేసే అవకాశం ఉందని కేవలం అనుమానంతో ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడం నిరంకుశత్వానికి పరాకాష్ఠ.    

రాజ్యాంగ నైతికత రక్షణ ఆవశ్యకత

సమాజంలో చిచ్చుపెట్టే  విద్వేష  ప్రసంగాలను,  ముఖ్యంగా  సోషల్ మీడియాలో  రెచ్చగొట్టే పోస్టులను అరికట్టాలనే ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయమే.  అయితే,  ఈ బిల్లులోని నిబంధనలు ‘రక్షణ కవచం’లా కాకుండా, విమర్శకుల గొంతు నొక్కే  ఆయుధంలా మారే అవకాశం ఉందన్నది  ప్రధాన ఆందోళన.  ఈ బిల్లులో 'విద్వేషం', 'అశాంతి', 'దురుద్దేశం' వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేవు.   దీనివల్ల ఏది విమర్శ?  ఏది విద్వేషం? అనే విషయాన్ని  నిర్ణయించే అధికారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకి వెళ్తుంది.  ఇది  అధికార  దుర్వినియోగానికి దారితీసి,  రాజకీయ  ప్రత్యర్థులను లేదా  ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులను  ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెలెక్ట్ కమిటీ ఈ బిల్లులోని  అస్పష్టతలను  తొలగించి,  రాజకీయ కక్ష సాధింపులకు తావులేకుండా సవరణలు 
చేయాల్సిన అవసరం ఉంది.

- డా. కట్కూరి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.