నాలుగు పాదాలలో మాత్రా బద్దంగా, లయాత్మకంగా ఒక సంపూర్ణ భావాన్ని నింపుకొని, ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన ‘మణిపూసలు’ ఒక విశిష్టమైన లఘురూప కవితా ప్రక్రియగా ప్రఖ్యాతిగాంచింది. ఎందరో సాహితీ సృజనకారుల ఆదరణకు నోచుకున్నది. వడిచర్ల సత్యం మానస పుత్రిక ఈ ‘మణిపూసల’ దారిలో విద్యార్థులు మొదలుకొని అవధానుల వరకు ప్రతి నిత్యం అనేక మణిపూసలు రాస్తున్నారు.
రోజుకో ప్రేరణాత్మక మణిపూసను రాస్తూ దాని భావానికి అనుగుణంగా ఒక అందమైన చిత్రాన్ని జోడిస్తూ, వాట్సప్, ఫేస్‌బుక్ మాధ్యమాల్లో ప్రసారం చేసి సాహితీ వేత్తలు, పాఠకుల హృదయాల మన్ననలు పొందుతున్న కవి కల్లూరి ప్రభాకరాచారి. మణిపూసలు రాయడంలో చేయితిరిగిన కవి. తాను రాసిన మణిపూసలను ‘‘భావజలధి’’ పేరుతో ఇటీవలే ఒక మంచి పుస్తకంగా తీసుకువచ్చారు.
కల్లూరి కలం నుంచి జాలువారిన ప్రతీ మణిపూస ఒక ఆణిముత్యమే. అలాంటి ఆణిముత్యాలతో కూడిన సప్తశతి మణిపూసలు ఉన్న పుస్తకం ‘భావజలధి’. ఈ పుస్తకమును ప్రధానంగా నాలుగు భాగాలుగా మహనీయుల, సామాజిక, ముక్తకాల, ప్రశంసల మణిపూసలుగా విభజించడం గమనార్హం. ఏ శుభకార్యానికైనా, ఎలాంటి విఘ్నాలు కలగకూడదని మనం విఘ్నేశ్వరునికి మొదట పూజ చేస్తాము. అదేవిధంగా కవి కల్లూరి కూడా తన భావజలధి పుస్తకమును గణపతి ప్రార్థనతో ప్రారంభించడం విశేషం.
విఘ్నంబులు తొలగిపోగ
విజయానికి దారి వేగ
చూపుమయ్య గజాననా
మణిపూసలు పుస్తకముగ!
అని తాను రాయబోవు మణిపూసల రచన విజయవంతం కావాలని, మనస్ఫూర్తిగా వినాయకుడిని వేడుకున్నారు.
మన వున్నతి కోరునమ్మ
మనకై జీవించునమ్మ
సృష్టిలోన గొప్ప సృష్టి
ఇల వెలసిన దేవతమ్మ!
సరళంగా ఉన్న ఈ అందమైన కవితా పంక్తులు అమ్మ గొప్పతనాన్ని, ఆమె నిస్వార్థ ప్రేమని ఎంతో హృద్యంగా కొనియాడుతున్నాయి. తన పిల్లల ఉన్నతమైన భవిష్యత్తును కోరుకుంటూ, కేవలం వారికోసమే తన జీవితాన్ని అంకితం చేసే అమ్మ... దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి అని అభివర్ణించడం అత్యద్భుతంగా ఉంది. మన కళ్లముందు ఈ భూమిపై కనబడుతున్న ఒక ప్రత్యక్ష దేవత అమ్మ అనే ఈ పంక్తులు ఎంతో భావగర్భితంగా చాటిచెబుతున్నాయి.
పంచశీల బోధించెను
సూక్తులెన్నొ సూచించెను
జ్ఞానజ్యోతి బుద్ధుడుగ
ప్రపంచాన వెలుగొందెను!
ఈ మణిపూస గౌతమ బుద్ధుని మహత్వాన్ని, ఆయన ప్రవచించిన శాంతి పథాన్ని తెలియజేస్తుంది. మానవాళికి ఐదు ముఖ్య జీవన సూత్రాలైన ‘పంచశీల’ను బోధించి, ఎన్నో మంచి సూక్తులతో సన్మార్గాన్ని చూపిన బుద్ధుడు, ఒక గొప్ప జ్ఞానజ్యోతిగా మారి ఈ ప్రపంచమంతటా వెలుగులు నింపారని చాలా చక్కగా నొక్కి చెప్పారు.
స్వామి వివేకానంద, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభభాయి పటేల్, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, అబ్దుల్ కలాం, పీవీ నరసింహా రావు మొదలగు మహాపురుషుల గురించి రాసిన మణిపూసలు ఆయా వ్యక్తుల ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. దేశం కోసం, సమాజం కోసం త్యాగం చేసిన మహానుభావులను మణిపూసల రూపంలో అక్షరార్చన చేయడం కడుసుందరంగా ఉంది.
అంతేకాక మరికొంత మంది సాహితీ మూర్తుల విశేషాలను కూడా పొందుపరుస్తూ, కవి కల్లూరి రాసిన మణిపూసలలో తనకు పూర్వ కవుల పట్ల ఉన్న భక్తి, గౌరవం కనబడుతుంది.శ్రీరంగం శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తూ రాసిన ఒక ఆకర్షణీయమైన మణిపూసలో ఆయన విప్లవ స్ఫూర్తిని ఇలా ప్రకటించారు.
రెండక్షరాల శ్రీశ్రీ
మెండైన కవిత శ్రీశ్రీ
సాహిత్యపు సమరంలో
విప్లవగీతము శ్రీశ్రీ!
అంటూ అల్లిన కవిత అల్పాక్షరాల్లో అనల్పర్థం అన్నట్లు సాగింది. ఇంకా దాశరథి, జాషువా, సురవరం ప్రతాప రెడ్డి, కాళోజి, గిడుగు రామమూర్తి, సినారె, కపిలవాయి, రావూరి, కూరెళ్ల విఠలాచార్య, అన్నమయ్య, గురజాడ, జంధ్యాల, వేమన మొదలగు సాహితీ పుంగవులతో పాటు నేటి ఆధునిక కవులైన దొరవేటి, వడిచర్ల లాంటి కవులకూ ఈ సంపుటిలో స్థానం కల్పించడం విశేషమని చెప్పవచ్చు. ఈ మణిపూసలు ఆయా మహాకవుల వ్యక్తిత్వాలను మన కళ్లముందు నిలుపుతాయి.
సామాజిక మణిపూసల శీర్షికలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకున్న ప్రాధాన్యతను తెలియజేస్తూ....
ఓటన్నది మనకు హక్కు
అవినీతిని అణగదొక్కు
ప్రజాస్వామ్య దేశాన
ఓటే కద పెద్ద దిక్కు!
అని కాస్త గట్టిగానే వక్కాణించారు. ‘నా నడుక తీరు’ అంటూ రాసిన మణిపూసలు ఆకట్టుకునేలా ఆరోగ్యానికి నడక అవసరం అని పేర్కొన్నాయి. ఇంకో దగ్గర
అమ్మభాష తెలుగు మిన్న
కమ్మనైన భావమున్న
అమృతమ్ము కురిసినట్టు
ఆనందమె పంచునన్న!
ఈ కవితా పంక్తులు మన మాతృభాష కమ్మదనాన్ని, విశిష్టతను ఎంతో అందంగా కొనియాడుతున్నాయి. ఎంతో మధురమైన భావాలు కలిగిన తెలుగు భాష అన్ని భాషలకంటే మిన్న అని, మన తెలుగు మాటలు వింటుంటే అమృతం కురిసినంత ఆనందం కలుగుతుందని కవి సుమనోహరంగా చెప్పి, భాషాభిమానాన్ని చాటుకున్నారు.
ఇలా వివిధ సామాజిక అంశాలతో కూడిన మణిపూసలతో పాటు ముక్తకాలలో ఎన్నో అంశాలను స్పృశిస్తూ రెండువందల పదహారు మణిపూసలు కూర్చారు. అదే విధంగా కల్లూరి ప్రభాకరాచారి రచనా కౌశలమును ప్రశంసిస్తూ వివిధ కవులు రాసిన మణిపూసలకు కూడా ఈ పుస్తకంలో చోటు కల్పించారు. ఈ పుస్తకం ద్వారా కవి సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. క్లుప్తత, స్పష్టత, గాఢత లక్షణాలు గల ఈ భావజలధి మణిపూసల గ్రంథం తెలుగు సాహితీ ప్రియులను అలరించి, ఒక విశిష్ట స్థానం పొందుతుందనడంలో అతిశయోక్తి లేదు.
- కందుకూరి భాస్కర్
- లైఫ్& లిటరేచర్ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్ ఐడీ featureseditor@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
- రచన 700 పదాలకు మించరాదు.
