అమ్మమ్మల త్యాగాలకు అక్షరరూపం 'నీ రుణం తీరేది ఎట్ల' ?

అమ్మమ్మల త్యాగాలకు అక్షరరూపం 'నీ రుణం తీరేది ఎట్ల' ?

తెలుగు సాహిత్యంలో వ్యక్తుల కేంద్రంగా సృజన చేసిన సందర్భాలు లేకపోలేదు. కాకుంటే ఎక్కువగా తల్లి చుట్టూ, తండ్రి కేంద్రంగా లేదా తమ ఇష్టదైవ స్తుతిగా మాత్రమే ఆ కావ్యాలు ఉన్నాయి. మానవత్వం మంట గలిసి పోతున్న ప్రస్తుత సందర్భంలో రచ్చరవి వెలువరించిన చక్కని కావ్యం ‘‘నీ రుణం ఎట్లా తీరేది?’’. ఇందులో అమ్మమ్మే కథా నాయకురాలు. నవలాశిల్పంలో కొనసాగిన ఈ రచన పాఠకులను ఆకట్టుకుంటుంది. ఆలోచన రేపుతుంది. మరిచిపోతున్న అమ్మమ్మల త్యాగాలకు హారతి పడుతుంది. 

అమ్మను కన్న అమ్మ అమ్మమ్మ. అమ్మమ్మ కూడా ఒక అమ్మే. అమ్మతనానికి నిలువెత్తు విగ్రహం అమ్మమ్మ. అలాంటి అమ్మమ్మ కూడా సినిమా దర్శకునిలా తెర వెనకే మిగిలిపోతుంది. ఆశ్చర్యంగా తెలుగు సాహిత్యంలో అమ్మను కొలిచినంతగా అమ్మమ్మను తలవలేదు. భాగవతాన్ని రచించిన పోతనామాత్యుడు ‘‘అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ’’ అన్నాడు. ఆ స్మరణ కూడా అమ్మమ్మను గురించి కాదు. ఆదిశక్తిని గురించి. మనం భూతద్దం వేసి వెతికినా అమ్మమ్మను కావ్యవస్తువు చేసుకున్న రచనలు ఒకటీ అరా కూడా దొరకవు. 

ఇవాళ గ్లోబలైజేషన్​ మూడవ దశలో వ్యక్తుల స్మరణ పెరిగిపోయింది. వ్యవస్థ నుంచి వ్యక్తికి చైతన్యం మారిపోయింది. ఎవ్వరూ పట్టించుకోని మనుషులను పట్టించుకోవడం కూడా అవసరమే. గుండెల నిండా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా మన బాధ్యతే. అట్లా ఇప్పటిదాకా అమ్మ, నాన్న, స్నేహం, మానవత్వం గురించి పలు రచనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమ్మమ్మ మీద ఒక నవల లాంటి రచన ఇప్పుడు మన ముందుకు వచ్చింది. దీని సృష్టికర్త రచ్చరవి. 

రచ్చ రవి! ఈ పేరు ఇవాళ రెండు తెలుగు రాష్ర్టాలకే కాదు, తెలుగువారు విస్తరించిన ఖండాంతరాలకు సుపరిచితమే. నటుడిగా జబర్దస్త్​ నుంచి మొదలై,  వెండితెర దాకా ఎదిగినవాడు. తన ప్రతిభను మాత్రమే నమ్ముకుని మొండిపట్టుదలతో ముందుకు సాగుతున్నవాడు. అట్లా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. స్వచ్ఛమైన మనసున్నోడు. మనిషి కనిపిస్తే చాలు అల్లుకుపోయే తనమున్నోడు. ఒక్కమాటలో చెప్పాలంటే రవి కలుపుగోలు మనిషి. ఈ మంచి మనసు వల్లే తన మూలాలను తాను తడుముకుంటున్నాడు. తన ఎదుగుదలకు బాల్యంలో బీజం వేసిన అమ్మమ్మకు అక్షర దండాలు పెడుతున్నాడు. 

ఈ అమ్మమ్మ ఒక్క రచ్చ రవి అమ్మమ్మే కాదు. మనందరి అమ్మమ్మ. ఈ పుస్తకం తెరిచినప్పటి నుంచి మనకు మన అమ్మమ్మ గుర్తుకు వస్తూనే ఉంటుంది. నిజానికి బాల్యంలో అమ్మానాన్నల తరువాత ఎవ్వరికైనా ప్రియమైన తోడు అమ్మమ్మే. బుజ్జగించినా, బువ్వ పెట్టినా అమ్మమ్మే. అప్పుడప్పుడు అమ్మానాన్నలకు మన మీద కోపం రావచ్చు. తిట్టొచ్చు. మనం వినకపోతే దండించవచ్చు. కానీ, అమ్మమ్మకు ఇవేవి తెలియవు. 

ఒక్క మనల్ని వెనకేసుకురావడం మాత్రమే తెలుసు. మనం అలిగితే ఆదరించేది అమ్మమ్మే. మనం గెలిస్తే సంబురపడేది అమ్మమ్మే. అలాంటి అమ్మమ్మ పాత్ర గురించి, ఆమె అద్భుత త్యాగాన్ని గురించి మనం ఏనాడో మరిచిపోయాం. ఇదిగో ఇప్పుడు రచ్చ రవి మన చేయి పట్టుకుని తీసుకుపోయి వాళ్ల అమ్మమ్మను సజీవంగా పరిచయం చేస్తున్నాడు. 

ఈ రచనకు వస్తువే ప్రాణం. తాను ఎంచుకున్న సబ్జెక్ట్​ కొత్తది. ఆ సబ్జెక్ట్​ను నిలబెట్టింది అతని రచనా శైలి. ముఖ్యంగా ఇందులో ప్రయోగించినది ఉత్తర తెలంగాణ భాష. మనం విద్యావంతులమయ్యే కొద్దీ, మన ఒరిజినల్​ భాషకు దూరమవుతాం. రచ్చరవి మాత్రం అలా దూరం కాలేదు. ఎంతో తడితడిగా చెప్పుకొచ్చాడు. అందుకే మనం ఈ పుస్తకం చదువుతున్నంత సేపు నవ్వుకుంటాం. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎన్నెన్నో భావోద్వేగాలకు గురై మైమరిచిపోతాం. 

అదీ రచ్చ రవి రచనాశైలి. తనకు అమ్మమ్మ మీద కొండంత ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ వల్లనే ఈ పుస్తకం ఇంత గొప్పగా వచ్చింది. భాగాలు భాగాలుగా తన జీవితంలో నుంచి అమ్మమ్మను పరిచయం చేశాడు. ఆమె నిండైన వ్యక్తిత్వానికి దోసిలి పట్టాడు. కుటుంబంలో ఆమె పోషించిన పాత్రకు పొర్లుదండాలు పెట్టాడు. ఇంత సునిశిత పరిశీలన తనకు ఎట్లా అలవడిందో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

రచ్చరవికి ఇప్పుడు మూడు పదుల వయసు ఉండొచ్చు. కానీ తాను మూడేళ్ల వయసుకు వెళ్లి అమ్మమ్మతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. ఇన్నిన్ని విషయాలను ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు అనిపిస్తుంది. అలా తన వయసు పెరుగుతున్న కొద్దీ, అమ్మమ్మ తన జీవితంలో ఎలా భాగమయ్యిందో అద్భుతంగా వర్ణించాడు. ఎవ్వరికైనా అమ్మమ్మలుంటారు. వారితో ఏవేవో జ్ఞాపకాలు ఉంటాయి. వారిని అవి చెప్పమంటే ఇంత పూసగుచ్చినట్టు చెప్పడం అసాధ్యం. 

రచ్చరవిని అమ్మమ్మ పూనింది. తనకు తెలియకుండానే తాను అమ్మమ్మలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అమ్మమ్మే తానై, తానే అమ్మమ్మై చెలరేగిపోయాడు. నటుడు కదా. అందువల్లే ఇది సాధ్యమైనట్టుంది. అమ్మమ్మ ఒక యూనివర్సల్​ టాపిక్‌. ఆమెకు ప్రాంతాలు, దేశాలు లేవు. అమ్మమ్మ ఎక్కడైనా అమ్మమ్మే. అలాంటి అమ్మమ్మను తిరిగి బతికించే పని చేశాడు రచ్చరవి. అందుకే ఇది అమ్మమ్మకు పట్టం కట్టిన రచన.

మనం ఎక్కడినుంచి బయల్దేరామో తెలిస్తేనే, మనం ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుందట. తనకు ఇంత పేరు వచ్చినా సరే, తన గతాన్ని మరువని తనానికి ఈ రచన ఒక సాక్ష్యం. అమ్మ అమ్మమ్మగా మారాలంటే తనకు ఒక కూతురు ఉండాలి. 

ఆ కూతురికి సంతానం కలిగితే తప్ప అమ్మ అమ్మమ్మ కాలేదు. అమ్మ పాత్ర నుంచి అమ్మమ్మ పాత్రలోకి మారి, ఒదిగిపోయే తీరును రచ్చ రవి చక్కగా పట్టుకున్నాడు. అందుకే ఈ పుస్తకంలో ఒక చోట అంటాడు.. ‘మనం కడుపులో పడ్డాక, తల్లి మనల్ని మోస్తుంది. కానీ, అమ్మమ్మ మన అమ్మను, మనల్ని ఇద్దరినీ మోస్తుంది’ అని. ఇంత గొప్పగా అమ్మమ్మను అందరూ అర్థం చేసుకోలేరు. గర్భం దాల్చిన కూతురుని, హాస్పిటళ్లకు తిప్పుతూ తోడు నీడగా ఉండి కంటికి రెప్పలా కాపాడే తల్లులను నేను చూశాను. 

ఎంత గొప్ప అనుబంధం కదా అనిపించేది. అలాంటి గొప్ప అనుబంధాన్ని గురించి ఏదైనా రాయాలనే ఆశ ఉండేది. నేను కేవలం ఒక పాట వరకో, కవిత వరకో మహా అయితే కథ వరకో ఆలోచించాను. కానీ, రచ్చ రవి మాత్రం ఏకంగా రెండువందల పేజీల అక్షర హారతి పట్టాడు. ఇది తప్పకుండా తెలుగు సాహిత్యంలో ఒక మంచి రచనగా నిలుస్తుంది. రచ్చ రవిని రచయితగా నిలబెడుతుంది. మనందరి ఇళ్లల్లో మంచి పుస్తకాల జాబితాలో అమ్మమ్మలాగే తలెత్తుకుని తొంగిచూస్తుంది.

తెలంగాణ మట్టిమనుషుల జీవన విధానం సాధు జీవన సంస్కృతితో ఉంటుంది. రేపటి గురించి యావ ఉండదు. బహుజనులు ఏ పూట గురించి ఆ పూటే ఆలోచిస్తారు. ఆకలన్నవాడికి అన్నం, ఆపదన్న వాడికి భరోసానిచ్చి అండగా నిలిచేతత్వం ఉంటుంది. ఈ రకమైన జీవన విధానం రచయిత అమ్మమ్మ శాంతమ్మలో కూడా ఉంది. ఆమె మాటతీరు, కట్టుబొట్టు అన్నింటినీ రచ్చ రవి ఆకళింపు చేసుకున్నాడు. అందుకే ఆయన అమ్మమ్మ జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రతి మనిషి ఎదుగుదలలో అమ్మమ్మ త్యాగాలకు నిలువెత్తు దర్వాజ ఈ పుస్తకం. 

- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత

  • లైఫ్​& లిటరేచర్​ పేజీకి సాహిత్య వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
  • రచన 700 పదాలకు మించరాదు.