హిమాలయాల్లో ఇంకా అందంగా దాగి ఉన్న ప్రకృతి స్వర్గం. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మ్యాప్‌లో చిన్నగా కనిపించినా, అక్కడికి వెళ్లిన తర్వాత మనసులో పెద్ద స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి అరుదైన ప్రదేశమే రూబీ వ్యాలీ. నేపాల్ హిమాలయ ప్రాంతంలో గణేష్ హిమాల్ పర్వతాల మధ్య విస్తరించిన ఈ లోయ ఇప్పటికీ సహజ అందాలను అలాగే దాచుకుంది. టూరిస్టులు ఎక్కువగా వెళ్లని ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రశాంతత ఇంకా అలాగే ఉంది. మంచు కొండలు, పచ్చని అడవులు, చిన్న గ్రామాలు, చల్లని గాలి కలిసి రూబీ వ్యాలీని కలల లోకంలా మార్చేస్తాయి.
మయన్మార్‌లోని మొగాక్ ప్రాంతానికి కెంపుల లోయ (రూబీ వ్యాలీ) అని పేరు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు కెంపులు దొరికేవని స్థానికులు చెప్తుంటారు. ఆ కారణంగానే ఈ లోయకు “రూబీ వ్యాలీ” అనే పేరు వచ్చింది. ఇక్కడ 1990లో దాదాపు 496 క్యారెట్లు, 1996లో దాదాపు 21,450 క్యారెట్లు, 2022లో దాదాపు 2,789 క్యారెట్ల బరువున్న కెంపులు లభించాయి. 1996లో దొరికిన రూబీ కంటే ప్రస్తుతం లభ్యమైన దాని విలువ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఆ విలువ ఎంత ఉండొచ్చనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు.
2015లో జరిగిన ఒక వేలంలో 25.59 క్యారెట్ల మయన్మార్ రూబీ 30.33 మిలియన్ల డాలర్లు (రూ.286 కోట్లు) పలకడం గమనార్హం. రీసెంట్గా 11వేల క్యారెట్ల (2.2కేజీలు) బరువున్న కెంపు లభించింది. అయితే ఈ ప్రాంతం అసలు సంపద.. రత్నాలు మాత్రమే కాదు. ప్రకృతి అందాలు, పర్వత జీవితం, అక్కడి ప్రజల అమాయక ఆతిథ్యం కూడా.
ఈ వ్యాలీకి ఖాఠ్మాండూ నుంచి ప్రయాణం మొదలవుతుంది. మొదట రోడ్డు ప్రయాణం. తర్వాత కొండ మార్గాల్లో ట్రెక్కింగ్. దారంతా వంకర తిరిగే రహదారులు, లోతైన లోయలు, మేఘాల్లో కనిపించే మంచు శిఖరాలు మనసును పరవశింపజేస్తాయి. ప్రయాణం కొంచెం కష్టంగా అనిపించినా, ప్రతి మలుపు కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది.
వాళ్లకు ఇది బెస్ట్ చాయిస్
ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకు రూబీ వ్యాలీ బెస్ట్ చాయిస్. ఇక్కడి మార్గాలు ఇంకా కమర్షియల్‌గా మారలేదు. పెద్ద హోటళ్లు, ట్రాఫిక్ వంటివి కనిపించవు. సహజంగా ఉన్న దారుల్లో నడుస్తూ పర్వత గ్రామాలను పలకరిస్తూ వెళ్లడం ఈ ప్రయాణంలో ఉన్న అసలైన ఆనందం. చిన్న చిన్న ఇళ్ల ముందు కూర్చొని నవ్వుతూ మాట్లాడే స్థానికులు టూరిస్టులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. చెక్కతో నిర్మించిన ఇళ్లు, పొయ్యిమీద వండిన భోజనం, వేడి టీ ప్రయాణానికి కొత్త అనుభూతి ఇస్తాయి. నగర జీవితంలో కనిపించని ప్రశాంతత అక్కడ ప్రతి క్షణంలో దొరుకుతుంది.
►ALSO READ | జ్యోతిష్యం : గ్రహాల కదలిక...ఆరోగ్య సమస్యలు .. మానవ శరీరంపై గ్రహాల ప్రభావం ఇదే..!
ఉదయాన్నే కనిపించే మంచు శిఖరాల అందం మాటల్లో చెప్పలేం. రూబీ వ్యాలీకి వెళ్లిన వాళ్లు ఎక్కువగా గుర్తుంచుకునేది ఆ సూర్యోదయమే. తెల్లవారుజామున మంచు కొండలపై పడే బంగారు కాంతి అద్భుతంగా కనిపిస్తుంది. గణేష్ హిమాల్ శిఖరాలు ఆ సమయంలో వెండి రంగులో మెరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా కదులుతూ కనిపిస్తే సినిమా సీన్‌లా అనిపిస్తుంది. మార్గమధ్యంలో జలపాతాలు, అడవులు, పూలతో నిండిన కొండచరియలు కనిపిస్తాయి. వసంత కాలంలో అయితే ఆ ప్రాంతం మొత్తం రంగురంగుల పూలతో మరింత అందంగా మారిపోతుంది. ఫొటోగ్రఫీ ఇష్టపడేవాళ్లకు ఇది స్వర్గం లాంటిది.
టూరిస్టులు మరింత పెరిగే అవకాశం
ఇటీవల నేపాల్ టూరిజం శాఖ రూబీ వ్యాలీ ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. కొన్నిచోట్ల కొత్త హోమ్ స్టేలు, ట్రెక్కర్ల కోసం విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో భారీ వర్షాలు, కొండచరియలు కొన్ని మార్గాలపై ప్రభావం చూపుతున్నాయని స్థానిక ట్రెక్కింగ్ గైడ్లు చెప్తున్నారు.
అందుకే ప్రయాణానికి ముందు వాతావరణ సమాచారం తప్పకుండా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రూబీ వ్యాలీ వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రావెల్ వ్లాగర్లు ఈ ప్రాంతాన్ని “హిమాలయాల్లో ఇంకా కమర్షియల్ కాలేని అందమైన లోయ”గా పరిచయం చేస్తున్నారు. అందువల్ల రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి టూరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
స్థానిక సంస్కృతి
ఈ ప్రాంతంలో గురుంగ్, తమాంగ్ వంటి తెగల ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ల సంప్రదాయ జీవితం టూరిస్టులకు కొత్త అనుభవం ఇస్తుంది. కొన్ని గ్రామాల్లో రాత్రి సమయంలో స్థానిక పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తుంటారు. పర్వతాల మధ్య చిన్న ఇళ్లలో గడిపే రాత్రులు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక్కడ మొబైల్ నెట్‌వర్క్ చాలా చోట్ల పనిచేయదు. అదే అసలు ప్రత్యేకతగా చాలామంది భావిస్తున్నారు. ఫోన్, సోషల్ మీడియా దూరమైన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా మారుతుందో అక్కడే తెలుస్తుంది.
