కాలేజీల ఫెడరేషన్ మీటింగ్ పై వారంలో నిర్ణయం తీస్కోండి

కాలేజీల ఫెడరేషన్ మీటింగ్ పై వారంలో నిర్ణయం తీస్కోండి
  • ఫతి పిటిషన్‌పై సర్కారుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను రాబట్టుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశం నిర్వహించుకోవాలన్న విజ్ఞప్తిలో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ఎల్‌బీ స్టేడియంలోగానీ, పర్వతపూర్‌లోని అరోరా క్యాంపస్‌లోగానీ బహిరంగ సమావేశం నిర్వహించుకోవడానికి ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇనిస్టిట్యూషన్స్‌(ఫతి) పెట్టుకున్న దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సిటీ పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ సమావేశం నిర్వహణ కోసం నగర పోలీసు కమిషనర్‌కు పెట్టుకున్న దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో ఫతి శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఫతి తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. సర్కారు నుంచి రూ. 10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో 2,200 కాలేజీలపై ప్రభావం పడుతోందన్నారు. సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోవడంతోపాటు నిర్వహణ కష్టంగా మారిందన్నారు. పలు కాలేజీలు మూతపడ్డాయన్నారు. అందుకే బకాయిలు రాబట్టుకోవడంపై కార్యాచరణ నిమిత్తం కాలేజీ నిర్వాహకులతో చర్చించడానికి సమావేశం నిర్వహించాలని అనుమతి కోరుతున్నామన్నారు. ప్రభుత్వ అడ్వకేట్ మహేష్‌ రాజె వాదిస్తూ ఈ అంశంపై వివరాలు తెలుసుకోవాల్సి ఉందని, గడువు కోవాలని కోరారు. దీంతో కాలేజీల సమాఖ్య వినతిపత్రంపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను జడ్జి క్లోజ్ చేశారు. 

పెన్షన్‌ వివాదాన్ని పరిష్కరించండిరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

80 ఏళ్ల మాజీ అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎం.సురేశ్‌కుమార్‌ పెన్షన్‌ దరఖాస్తును 8 వారాల్లో పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ కేసులో శిక్ష పడినప్పటికీ, హైకోర్టు కేసు కొట్టివేసినా పెన్షన్, గ్రాట్యుటీ చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ సురేశ్ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు లాయర్ వాదిస్తూ.. సురేశ్ కుమార్ 2006లో పదవీ విరమణ చేశారన్నారు.

2007లో ఏసీబీ కోర్టు దోషిగా ప్రకటించడంతో ప్రభుత్వం పెన్షన్‌తోపాటు గ్రాట్యుటీ నిలిపివేసిందన్నారు. 2024లో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తూ పిటిషనర్‌ను నిర్దోషిగా ప్రకటించిందన్నారు. అయినప్పటికీ బకాయిలతోపాటు పెన్షన్‌ను, గ్రాట్యుటీని చెల్లించడంలేదన్నారు. 12 శాతం వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని కోరారు. పెన్షన్‌ బకాయిలకు సంబంధించి 2 వారాల్లో వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌ను జడ్జి ఆదేశించారు.