- ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: హైకోర్టు
- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వివాదాన్ని డివిజన్ బెంచే తేల్చాలి
- పంచాయతీ ఎన్నికల పిటిషన్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలు లేకపోయినా వారికే రిజర్వేషన్లు కేటాయించడంతో ఎన్నికల లక్ష్యానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వివాదాలకు సంబంధించిన పిటిషన్‌లపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ఈ పిటిషన్‌లను బెంచ్ ముందు ఉంచాలంటూ రిజిస్ట్రీకి సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో 8 మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాన్ని రిజర్వ్ చేశారని, వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి పంచాయతీలో ఎస్టీ ఓటరు లేకపోయినా సర్పంచ్‌తో పాటు 3 వార్డులు రిజర్వ్ చేశారని దాఖలైన పిటిషన్లపై మంగళవారం జస్టిస్ టి.మాధవీ దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపించారు.
కొన్ని గ్రామాల్లో ఎస్టీలు లేకపోయినా ప్రభుత్వం వారికే సర్పంచ్ స్థానంతో పాటు వార్డు మెంబర్ స్థానాలను రిజర్వ్ చేసిందన్నారు. ఆరుగురు ఓటర్లు ఉంటే సర్పంచ్‌తో పాటు 2 వార్డు స్థానాలను రిజర్వ్ చేసిందని తెలిపారు. రిజర్వేషన్లు సవరించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌లు కల్పించిందన్నారు.
ప్రస్తుత జనాభాను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. సామాజిక న్యాయంతో పాటు అణగారిన వర్గాలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాతినిథ్యం కల్పించడానికి రాజ్యాంగం రిజర్వేషన్‌లు కల్పించిందన్నారు. ఎస్టీ, ఎస్సీలకు 2011, బీసీలకు 2024 (ఎస్‌ఈఈఈపీసీ) జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్, వార్డు మెంబరు స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్‌లు కేటాయించిందని తెలిపారు.
ఇక్కడ దాఖలైన పిటిషన్‌లోని అంశాలను పరిశీలిస్తే ఎస్టీలు లేకపోయినా, ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోయినా సర్పంచ్, వార్డు మెంబరు స్థానాలను రిజర్వు చేసిందని, దీంతో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. ఇలా ఉంటే.. ఎన్నికల ఉద్దేశంతో పాటు, ప్రజాస్వామ్య విలువల లక్ష్యం నెరవేరదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పిటిషన్‌లలో ఇతరులకు రిజర్వు చేయాలంటూ ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే.. అవి రోస్టర్ ప్రకారం కేటాయించిన ఇతర రిజర్వేషన్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ పంచాయతీల ఎన్నికలపై డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ పిటిషన్‌లను బుధవారం డివిజన్ బెంచ్ ముందుంచాలంటూ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.
