- సర్టిఫికెట్ వెరిఫికేషన్ రెండు నెలల్లో పూర్తి చేయాలి
- సర్వీసుల క్రమబద్ధీకరణ, వార్షిక ఇంక్రిమెంట్లపై
- నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 714 మంది జూనియర్ లెక్చరర్ల (జేఎల్) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జేఎల్స్ సర్వీసుల క్రమబద్ధీకరణ, వార్షిక ఇంక్రిమెంట్లపై చట్టప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ శరత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషన్లను పరిష్కరించారు.
2023లో జీఓలు19, 20, 21 ద్వారా లెక్చరర్ల సేవలను క్రమబద్ధీకరించినా.. ఇప్పటివరకు ప్రొబేషన్ ప్రకటించలేదని, వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదని పిటిషనర్ల లాయర్ కోర్టుకు తెలిపారు. దీనివల్ల జీతభత్యాలు, ప్రమోషన్లు, సీనియారిటీ నష్టపోతున్నారని వాదించారు. మూడేళ్ల కిందటే ప్రొబేషన్ కాలం పూర్తయినా పెండింగ్‌లో పెట్టడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ.. 70 శాతం మంది జేఎల్స్ సిక్కిం, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి ఇతర రాష్ట్రాల సర్టిఫికెట్లు సమర్పించారని చెప్పారు. అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి రికార్డులు పరిశీలిస్తున్నందున ధ్రువీకరణ ఆలస్యమవుతోందని, కొంత గడువు కావాలని కోరారు. స్పందించిన హైకోర్టు.. 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి, ప్రొబేషన్ ప్రకటన, ఇంక్రిమెంట్ల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
