హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నాంపల్లిలోని భీంరావ్ వాడ బస్తీవాసులకు కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిరాశ్రయులైన కుటుంబాలకు పూర్తి హక్కులతో పట్టాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసానికి అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, లిఫ్ట్ తదితర అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
భీంరావ్ వాడను గుర్తింపు పొందిన మురికివాడల జాబితా నుంచి తొలగిస్తూ 2008లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 251ను సవాలు చేస్తూ కె. భారతితోపాటు మరో 70 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుద్దాల చలపతిరావు విచారించారు. బాధితులు నాంపల్లిలో 60 ఏళ్లకు పైగా నివసిస్తున్నారని తెలిపారు. 1991లోనే ఈ ప్రాంతాన్ని మురికివాడగా గుర్తిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిందన్నారు.
ఆ తర్వాత ఒక్కో కుటుంబానికి 33.33 చదరపు మీటర్ల స్థలానికి పట్టాలు ఇచ్చి, తరువాత అవి పొరపాటున జారీ అయ్యాయని పేర్కొంటూ రద్దు చేయడం అన్యాయమన్నారు. 2007 జనవరి 2న పోలీసులతో బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించి కూల్చివేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ.. తాము చట్టప్రకారమే ఖాళీ చేయించామని చెప్పారు.
బస్తీవాసుల డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు.. రెండు నెలల్లోగా భీంరావ్ వాడ బస్తీవాసులకు కొల్లూరులో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితులు దాదాపు 17 ఏళ్లుగా అద్దె ఇళ్లలోనే నరకం చూస్తున్నందున, వారికి కేటాయించే ఇళ్లను ఐదేళ్లపాటు విక్రయించరాదనే గట్టి షరతు విధించింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఇప్పటికే మరణించిన వారు ఉంటే, వారి కుటుంబ సభ్యులను గుర్తించి అర్హత ప్రకారం ఇళ్లు ఇవ్వాలని సూచించింది.
అంతేకాకుండా, ఈ కేసులో పిటిషనర్లుగా లేకపోయినా, అదే బస్తీకి చెందిన ఇతర అర్హులైన నిరాశ్రయులు ఎవరైనా ఉంటే వారు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. వారి వినతులను కూడా పరిశీలించి, నిబంధనల ప్రకారం ఇళ్ల కేటాయింపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
