హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలన్న వినతి పత్రాన్ని పరిశీలించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీలును మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. వినతి పత్రాన్ని పరిశీలించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినంత మాత్రాన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్టు కాదని తేల్చి చెప్పింది.
పారదర్శకంగా సకాలంలో ఎన్నికలు నిర్వహించడంపైనే ప్రజాస్వామ్య ప్రక్రియ సమగ్రత ఆధారపడి ఉంటుందని, ఈ పక్రియను పరిరక్షించడం అన్ని సంస్థల లక్ష్యమని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో పిటిషనర్ల పేర్లను చేర్చడం ద్వారా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఎన్నికల సంఘానికి ఎలాంటి నష్టం వాటిల్లదంటూ అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
కేంద్రం ఓటర్ల జాబితాలో పేర్లుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితాలో పేర్లు లేకపోవడంతో తమపేర్లు చేర్చాలంటూ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన సి. కల్పన మరో ఏడుగురు పెట్టుకున్న వినతి పత్రాన్ని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
