బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. కూకట్‌‌‌‌పల్లిలోని హుడా ట్రక్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ భూమి వేలానికి గ్రీన్ సిగ్నల్ 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. కూకట్‌‌‌‌పల్లిలోని హుడా ట్రక్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ భూమి వేలానికి  గ్రీన్ సిగ్నల్ 
  • వేలాన్ని సవాల్​ చేస్తూ వేసిన పిల్​లను కొట్టివేసిన న్యాయస్థానం
  • వేలం డబ్బులను ప్రజాప్రయోజనాలకే వినియోగిస్తామన్న ప్రభుత్వం
  • బీఆర్​ఎస్​ హయాంలో ఈ భూమి ప్రైవేట్ సంస్థలకు బదలాయింపు 
  • దాన్ని ఇప్పుడు వేలం వేస్తుంటే అభ్యంతరాలు.. రాజకీయవర్గాల్లో చర్చ

     
హైదరాబాద్‌, వెలుగు: కూకట్‌పల్లిలోని హుడా ట్రక్‌ పార్కింగ్‌ స్థలం వేలం వ్యవహారంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. వేలం నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టి వేస్తూ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌ శ్యామ్‌కోశీ, జస్టిస్‌ సుద్దాల చలపతిరావుతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు చెప్పింది. హైదరాబాద్‌లోని మూసాపేట పరిధిలో ఉన్న 3.15 ఎకరాల హుడా ట్రక్‌ పార్కింగ్‌ స్థలాన్ని ఈ నెల 27న వేలం వేయాలని కలెక్టర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త మాధవరం కాంతారావు పిటిషన్లు దాఖలు చేశారు.

ప్రజాప్రయోజనాల కోసం సేకరించిన భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం విక్రయించడం చట్టవిరుద్ధమని, భూసేకరణ చట్టానికి అతీతమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ.. సబ్​ టెర్మినల్​ ఏర్పాటు కోసం 2005లో భూసేకరణ జరిగిందని, ఆ ప్రాజెక్టు ప్రతిపాదన రద్దు కావడంతో భూమిని వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని ప్రజాప్రయోజనాలకే వినియోగిస్తామని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం.. వేలం ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవసరమైన ప్రజాప్రయోజనాన్ని పిటిషనర్లు నిరూపించలేకపోయారని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టివేసింది. మరోవైపు, ఇదే వేలం నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హుడా మెట్రో పార్కింగ్, లోకల్‌ లారీ అండ్‌ డీసీఎం స్టాండ్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ శుక్రవారం విచారణ చేపట్టారు. ఇదే అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసినందున, ఆ తీర్పు పూర్తి ప్రతిని పరిశీలించిన తర్వాత వాదనలు వినిపించేందుకు గడువు ఇవ్వాలని అసోసియేషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. 

బీఆర్​ఎస్​ ఎత్తులు చిత్తు..

హుడా ట్రక్‌ పార్కింగ్‌భూముల ఈ- వేలంపై కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు​ కొట్టివేయడంతో ఈ భూముల విషయంలో బీఆర్ఎస్ రాజకీయం చర్చనీయాంశమైంది. ట్రక్​ టెర్మినల్​ కోసం 1980లోనే  అప్పటి ప్రభుత్వం 33 ఎకరాలు సేకరించింది. ఇందులో చాలావరకు భూములను గతంలోనే ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే మెట్రో క్యాష్ అండ్ క్యారీకి 7.10 ఎకరాలు, డీఎల్‌ఎఫ్ సంస్థలకు 24.33 ఎకరాలు లీజుకు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇక్కడ కొంత భూమి ఎల్ అండ్ టీ నుంచి వాసవి గ్రూప్‌కు బదిలీ అయింది. గతంలో ట్రక్​ టెర్మినల్​ భూములను ఇతర సంస్థలకు అప్పగిస్తుంటే మౌనం వహించిన బీఆర్ఎస్​నేతలు ఇప్పుడు ప్రభుత్వం వేలం నిర్వహించాలని భావించగానే అభ్యంతరం చెప్పడానికి, పిల్​​ దాఖలు చేయడానికి రాజకీయాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాలానగర్, కూకట్‌పల్లి మెట్రో స్టేషన్లకు కూతవేటు దూరంలో 60 మీటర్ల జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ 3.15 ఎకరాల భూమికి హెచ్ఎండీఏ ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర నిర్ణయించింది. ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. వందల కోట్లు ఆదాయం సమకూరనుంది.