పన్ను కంటే వడ్డీ ఎక్కువనా? ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు

పన్ను కంటే వడ్డీ ఎక్కువనా? ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: చెల్లించాల్సిన ఆస్తి పన్నుకంటే దానికి విధించిన వడ్డీ ఎక్కువగా ఉండటంపై హైకోర్టు సోమవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పన్నును ఏ ప్రాతిపదికన లెక్కిస్తారని ప్రశ్నించింది. రూ.71 లక్షల డిమాండ్‌‌‌‌ నోటీసులో రూ. 41 లక్షలు పన్ను విధింపు ఎలా చేశారని, దీనికి సంబంధించి లెక్కింపు విధానం ఏమిటో చెప్పాలంది. సోమాజిగూడలోని 1122 చదరపు అడుగులుండగా 2122 చదరపు అడుగులకు ఆస్తిపన్ను లెక్కించి రూ.71 లక్షల డిమాండ్‌‌‌‌ నోటీసు పంపడాన్ని సవాలు చేస్తూ బంజారాహిల్స్‌‌‌‌కు చెందిన ఎం.అహ్మద్‌‌‌‌ సిద్ధిఖీ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ బి. విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి విచారణ చేపట్టి  సంపాదించిన ఆస్తికి... ఆదాయానికి పన్ను చెల్లింపులను ఎలా ఎగవేయాలి అన్నదానిపై లండన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ 

ఎకనామిక్స్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందినవారితో ఉపన్యాసాలు ఇప్పించాలన్నారు. ఇంటి పన్నుకు వడ్డీని ఎలా లెక్కిస్తారో జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులతో ఉపన్యాసం ఇప్పించాలన్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏటా రూ.1.16 లక్షల పన్ను ఉంటుందని, దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో వడ్డీతో సహా బకాయిలు పెరిగాయన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి రూ.5 లక్షలను మూడు రోజుల్లో చెల్లించాలని పిటిషనర్‌‌‌‌ను ఆదేశించారు. వాస్తవ పన్నుపై వడ్డీని ఏ ప్రాతిపదికన లెక్కించారో పూర్తి వివరాలు సమర్పించాలంటూ జీహెచ్‌‌‌‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.