ప్రైవేటు స్కూల్స్ అధిక ఫీజులపై హైకోర్టు విచారణ

ప్రైవేటు స్కూల్స్ అధిక ఫీజులపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజుల వసూలుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా కష్టకాలంలో స్కూళ్లు నడవకున్నా.. ఆన్ లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని గతంలో హైకోర్టులో హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. 
అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం జీవో 46 విడుదల చేసిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అధిక ఫీజులు చేస్తున్న స్కూల్స్ పై వచ్చిన ఫిర్యాదులకు ఆయా స్కూల్స్ కు షోకాస్ నోటిసులు ఇచ్చామని ప్రభుత్వం తెలియజేసింది. తామిచ్చిన నోటీసులకు వివిధ పాఠశాలల వారు సమాధానం ఇచ్చారని ప్రభుత్వం వివరించింది. స్కూళ్లు ఇచ్చిన వివరణలను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు ప్రభుత్వం 4 వారాల్లోగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలియజేసింది. 
ఇప్పటికే ఆన్ లాక్ చేసిన నేపథ్యంలో ఇక నుండి స్కూల్స్ భౌతికంగా నడుస్తాయన్న ప్రభుత్వం ఇక నుండి ఆన్ లైన్ క్లాసుల సమస్యలు  ఉత్పన్నం కావని ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్కూల్స్ ఇచ్చిన వివరణలను పరిశీలించి చట్ట ప్రకారం నాలుగు వారాల్లో చర్యలు తీసుకుంటామని కోర్టుకు ప్రభుత్వం తెలియజేయడంతో పిటిషన్ పై విచారణను హైకోర్టు ముగించింది.