సీబీఐకి హైకోర్టు ప్రశ్నల వర్షం.. అవినాష్ వాట్సప్ కాల్ ఎవరికి చేశారో తెలుసా?

సీబీఐకి హైకోర్టు ప్రశ్నల వర్షం.. అవినాష్ వాట్సప్ కాల్ ఎవరికి చేశారో తెలుసా?

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో శనివారం(మే27) వాడీవేడి వాదనలు కొనసాగాయి.  ఎంపీ అవినాష్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనను బుధవారం ( మే31)వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అవినాష్‌ తల్లి శ్రీలక్ష్మి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం వరకు అరెస్ట్ చేయకుండా అదేశాలు ఇవ్వాలని అవినాష్ న్యాయవాది కోరగా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అప్పటి వరకు అవినాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ విచారణలో భాగంగా సీబీఐ సంచలన వాదనలు చేసింది.  అంతే ధీటుగా హైకోర్టు కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు సహకరించడం లేదు. నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చూపుతున్నారు. వివేకా హత్యకు నెల రోజుల ముందే ప్లాన్ జరిగింది. వివేకా హత్యలో రాజకీయ కోణం ఉందని సీబీఐ ఆరోపించింది. ఎంపీగా అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్మెంట్స్ చెబుతున్నాయి కదా? అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్లు స్టేట్మెంట్స్ చెబుతున్నాయి. రాజకీయంగా అవినాష్ బలవంతుడని మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐ లాయర్ ను జడ్జి ప్రశ్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేశారు? వారి నుంచి సమాచారం రాబట్టారా? అని కోర్టు ప్రశ్నించింది.

అలాగే అవినాష్ రెడ్డి వాట్సప్ కాల్ ఎవరికీ చేశారో తెలుసా? అవినాష్ ఫోన్ ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అయితే కీలక సాక్షుల వివరాలు స్టీల్ కవర్ లో కోర్టుకు అందజేస్తామని సీబీఐ లాయర్ తెలిపారు. మరి పిటీషనర్ కు కూడా అందజేస్తారా అన్న ప్రశ్నకు ప్రస్తుత దశలో బయటపెట్టలేమని పేర్కొంది.  ఆ వాంగ్మూలాలపై అవినాష్ తరపు వాదనలు వినకుండా ఎలా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ప్రశ్నించింది. ఇరువైపులా వాదనలు వినకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా అని హైకోర్టు  ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఈ కేసుపై తుది తీర్పు ఈ నెల 31న వెలువరిస్తామని, అంతవరకు ఆయనను అరెస్ట్‌ చేయవద్దని సీబీఐకి ఉత్తర్వులు జారీ చేసింది. కనుక అవినాష్ రెడ్డికి మళ్ళీ మరో నాలుగు రోజులు ఉపశమనం లభించింది.