మహేశ్ బ్యాంక్​కు అధికారిని..ఎందుకు నియమించలే?

మహేశ్ బ్యాంక్​కు అధికారిని..ఎందుకు నియమించలే?
  •     ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించిన హైకోర్ట్
  •     కోర్టుధిక్కార నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు : మహేశ్​ కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు తెలంగాణ హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో మహేశ్​ బ్యాంక్ నిర్వహణకు ఒక ఆఫీసర్ ను నియమించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో ఆర్‌బీఐ విఫలమైందని కోర్టు తెలిపింది. దీనికిగాను ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో జూలై 7లోగా తెలియజేయాలని జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డి ఆర్‌బీఐ గవర్నర్‌ను ఆదేశించారు. 

తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేశారు. గతేడాది జనవరిలో మహేశ్​ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆర్‌బీఐ తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో బ్యాంక్ నిధులు దుర్వినియోగమయ్యాయని తేలింది.ఆ బ్యాంకు నిర్వహణకు ఒక ఆఫీసర్ ను నియమించాలని ఆర్‌బీఐని కోర్టు ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను ఆర్‌బీఐ అమలు చేయలేదు. బ్యాంక్  కార్యకలాపాలను మళ్లీ పాత చైర్మన్, వైస్‌ చైర్మన్ లే నిర్వహించారు.  దాంతో బ్యాంక్ వాటాదారుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది.