తబ్లిగీ జమాత్’​కు నిధులపై వివరణ ఇవ్వండి తెలంగాణకు హైకోర్టు ఆదేశం

తబ్లిగీ జమాత్’​కు నిధులపై వివరణ ఇవ్వండి తెలంగాణకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పరిగిలో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహించేందుకు నిషేధిత ‘తబ్లిగీ జమాత్’ అనే సంస్థకు రూ.2.45 కోట్లు మంజూరు చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ కలెక్టర్, స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో, తబ్లిగీ జమాత్ లీడర్లకు నోటీసులు జారీ చేసింది. 

తబ్లిగీ జమాత్​కు నిధులు మంజూరు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గత నెల 13న జీవో 123ని జారీ చేశారు. దీన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ గద్వాల్ జిల్లా భీమ్​నగర్​కు చెందిన అఫ్సర్ పాషా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో పరిగి మండలం జెమాత్​ నగర్​లో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పిటిషన్​లో తెలిపారు. నిధులు మంజూరును నిలిపివేయాలని కోరారు. తబ్లిగీ జమాత్ అనే సంస్థ 2020 జనవరిలో నిర్మల్ టౌన్​లో ఇస్లామిక్ సమ్మేళనం నిర్వహించిందని, ఆ తర్వాత రోజు భైంసాలో మతపరమైన హింస చెలరేగిందని వివరించారు.