జీవో111 పరిధిలో అక్రమ నిర్మాణాలపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు

జీవో111 పరిధిలో అక్రమ నిర్మాణాలపై..కౌంటర్ దాఖలు చేయండి : హైకోర్టు
  •     ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు సంస్థలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్‌‌‌‌సాగర్, హిమాయత్‌‌‌‌సాగర్ పరీవాహక ప్రాంతమైన జీవో 111 పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిషేధించిన పరీవాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర వివరాలు సమర్పించాలని ప్రభుత్వం, హెచ్‌‌‌‌ఎండీఏ, మెట్రో వాటర్‌‌‌‌ వర్క్స్, కాలుష్య నియంత్రణ మండలితో పాటు ప్రైవేట్ సంస్థలు ఆనంద్ కన్వెన్షన్, నియో కన్వెన్షన్, ఆర్య కన్వెన్షన్, కేఎల్‌‌‌‌ఎన్ ఉత్సవ్, కె.కన్వెన్షన్‌‌‌‌లకు స్పష్టంచేసింది. 

విచారణను డిసెంబర్ 11కి వాయిదా వేసింది. ఉస్మాన్‌‌‌‌సాగర్, హిమాయత్‌‌‌‌సాగర్‌‌‌‌లకు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలూ చేపట్టరాదంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 111కు విరుద్ధంగా కన్వెన్షన్ హాళ్లు నిర్మాణం కావడం, అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మందాడి మాధవరెడ్డి పిల్‌‌‌‌ దాఖలు చేశారు. దాన్ని  చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌ జీ.ఎం.మొహియుద్దీన్‌‌‌‌ల బెంచ్‌‌‌‌ గురువారం విచారించింది.

 పిటిషనర్ తరఫు న్యాయవాది పి. శశిధర్ రెడ్డి వాదిస్తూ..జంట జలాశయాలు హైదరాబాద్ కు ప్రధాన తాగునీరు సరఫరా వనరులు మాత్రమే కాక, వర్షాకాలంలో వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయని తెలిపారు. అందుకే వాటి చుట్టూ 10 కిలోమీటర్ల మేర నిర్మాణాలను నిషేధిస్తూ జీవో 111 జారీ అయిందన్నారు.అయినా ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి అనుమతులు, వ్యవసాయ భూమి మార్పిడి లేకుండా భారీ నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు.

 ఆనంద్ కన్వెన్షన్, నియో కన్వెన్షన్, ఆర్య కన్వెన్షన్, కేఎల్‌‌‌‌ఎన్ ఉత్సవ్, కె.కన్వెన్షన్‌‌‌‌లు పూర్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం..ఆరు నెలలుగా కౌంటర్లు దాఖలు కాలేదని, ఇలాగైతే నిర్మాణాలపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. చివరిసారిగా మూడు వారాల గడువు ఇస్తున్నామని, కౌంటర్లు తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.