పోలీస్ స్టేషన్ స్వీపర్లకు.. మినిమమ్ వేతనాలు ఇవ్వాలి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పోలీస్ స్టేషన్ స్వీపర్లకు.. మినిమమ్ వేతనాలు ఇవ్వాలి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న స్వీపర్లు, అటెండర్లు, స్కావెంజర్లకు మినిమమ్ వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల మల్లికార్జునతో పాటు మరో 48 మంది కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. కనీస వేతనాల చట్టం ప్రకారం కలెక్టర్‌‌ ఫిక్స్ చేసిన వేతనాలు తమకు ఇవ్వడం లేదని పిటిషన్‌‌ వేశారు. ఈ కేసుపై జస్టిస్‌‌ నగేశ్‌‌ భీమపాక విచారణ చేపట్టారు. 

పిటిషనర్ల తరఫు లాయర్‌‌ వాదిస్తూ.. కనీస వేతనాల చట్టం వచ్చి 68 ఏళ్లు దాటినా అమలు కావడం లేదన్నారు. పిటిషనర్లు చాలా ఏళ్లుగా పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్నారని, 2016లో కలెక్టర్‌‌ ప్రకటించిన మినిమమ్ వేతనాలు కూడా చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరఫు లాయర్‌‌ వాదిస్తూ.. వీరు ఔట్‌‌సోర్సింగ్‌‌, పార్ట్‌‌టైం, కంటింజెంట్‌‌ ఉద్యోగులని తెలిపారు. సహకార  సంఘం ద్వారా వీరి సేవలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. 

ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు.. ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న కార్మికులకు కలెక్టర్‌‌ ప్రకటించిన మినిమమ్ వేతనాలు చెల్లించాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.