
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి జరుగుతున్న ఎన్నికను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలితే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక ప్రక్రియను సవాలు చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు బి.హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని, నిలిపివేయాలని కోరారు. ఆదివారం(అక్టోబర్ 27)న జరగనున్న ఎన్నికలను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాట్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లను ఆదేశించింది.