రూల్స్‌‌ ప్రకారమే కంచె వేయాలి : హైకోర్టు

రూల్స్‌‌ ప్రకారమే కంచె వేయాలి :  హైకోర్టు
  •     హైడ్రాకు హైకోర్టు ఆదేశం
  •     నిషేధిత జాబితాలో ఉంటే ఎలా వేస్తారు?
  •     ఇష్టానుసారం ఫెన్సింగ్  పెడతామంటే కుదరదని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ భూములకు కంచె వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి అంటూ ఇష్టానుసారం కంచె వేస్తామంటే కుదరదని హెచ్చరించింది. కేవలం నిషేధిత జాబితాలో ఉన్నాయన్న కారణంగా భూములకు కంచె వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిషేధిత జాబితాలో ఉన్న ఏ భూమికి అయినా ప్రభుత్వ అనుమతి లేకుండా, అది ప్రభుత్వ భూమిగా ధ్రువీకరణ ఉంటే తప్ప కంచె వేయడానికి వీల్లేదని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌లో 1.26 ఎకరాల భూమికి హైడ్రా కంచె వేయడాన్ని సవాలు చేస్తూ సికింద్రాబాద్‌‌కు చెందిన ఎన్‌‌.సబిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌  కుమార్‌‌  విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌  తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ భూమి నిషేధిత జాబితాలో ఉందంటూ ఒక వ్యాపారవేత్త ఇచ్చిన సమాచారం ఆధారంగా కంచె వేయడంతోపాటు అక్కడ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. తమ భూమిలోకి జోక్యం చేసుకోకుండా హైడ్రాను అడ్డుకోవాలని, అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రికార్డులను పరిశీలించి నిషేధిత జాబితాలో ఉన్నాయన్న కారణంగా కంచె వేయడానికి వీల్లేదని, సంబంధిత కలెక్టర్‌‌  నుంచి అధికారిక వివరణ తీసుకోవాలని ఆదేశించారు. 

అంతేకాకుండా కంచె వేయడానికి అనుమతించే ముందు ఆ భూమికి సంబంధించి ఏవైనా కేసులున్నాయో లేవో ధ్రువీకరించుకోవాల్సి ఉందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణం అమలయ్యేలా చూడాలని హైడ్రా తరఫు న్యాయవాదికి సూచించారు. ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌‌కు, ప్రభుత్వానికి పంపాలంటూ రిజిస్ట్రీని ఆదేశించారు. ప్రస్తుత కేసులో కలెక్టర్‌‌  వివరణ అవసరమని, కలెక్టర్‌‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌‌ను ఆదేశిస్తూ విచారణను 13కు  వాయిదా వేశారు.