టీచర్ల బదిలీల్లో జోక్యానికి హైకోర్టు నో

టీచర్ల బదిలీల్లో జోక్యానికి హైకోర్టు నో

హైదరాబాద్, వెలుగు: టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యాసంవత్సరం మధ్యలో కంటే ప్రారంభంలోనే టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు ఉండాలని అభిప్రాయపడింది. వేరే జిల్లాల నుంచి ఎస్జీటీ, స్కూల్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ టీచర్లను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమంటూ రంగారెడ్డికి చెందిన సుమారు 40 మందికిపైగా టీచర్లు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల హైకోర్టు సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి విచారణ జరిపారు.

 బదిలీలు, పదోన్నతులపై గత నెల 25న మధ్యంతర ఉత్తర్వులను సవరించారు. పదోన్నతులు, బదిలీలు కొనసాగించేందుకు అనుమతి ఇస్తూనే.. పిటిషనర్లు 40 మంది పోస్టులను రిజర్వు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై కొందరు ఉపాధ్యాయులు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభినంద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సావిలి, జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్లు బాలకిషన్‌‌‌‌‌‌‌‌రావు, పీవీ కృష్ణయ్య వాదించారు. పదోన్నతులు, బదిలీలను తాము వ్యతిరేకించడంలేదని, కానీ సీనియారిటీ లిస్ట్‌‌‌‌‌‌‌‌ లేకుండా బదిలీలు చేయడం కుదరదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా సీనియర్లు రంగారెడ్డి జిల్లాకు వస్తే ఎలాగని ప్రశ్నించారు. 

ప్రతివాదుల తరఫు లాయర్లు రాంగోపాల్‌‌‌‌‌‌‌‌ రావు, ప్రభుత్వ లాయర్లు జోక్యం చేసుకుని.. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డికి వచ్చిన వారంతా జూనియర్లేనని వాదించారు. వాళ్లు రావడం వల్ల ఇక్కడి సీనియర్లకు అన్యాయం జరగదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ ప్రయోజనాలను ప్రధానంగా గమనంలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఈ దశలో బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. కోర్టుకు వచ్చిన 40 మందికి పోస్టులు ఖాళీగా ఉంచాలని సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఆదేశించారని, తుది తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే వాళ్లకు పోస్టుల కేటాయింపు జరుగుతుందని చెప్పింది. సింగిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్లను డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేసింది.