హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సేవల కోసం అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) నిధికి బేసిక్ పేలో 15 శాతం మొత్తాన్ని తప్పనిసరిగా మళ్లించే నిర్ణయంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగి నిజాముద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
జీవో నంబర్ 186, 79లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ లో ఉద్యోగుల బేసిక్ పేలో 15 శాతం మొత్తాన్ని ఆరోగ్య పథకం నిధికి తప్పనిసరిగా మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. సంబంధిత జీవోలను రద్దు చేయడంతో పాటు ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు.
