ఎల్ఐసీ అధికారులపై హైకోర్టు సీరియస్

ఎల్ఐసీ అధికారులపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌ఐసీలో ప్యూన్‌‌ పోస్టుల భర్తీ వ్యవహారంలో తామిచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్​ అయింది. ఫిబ్రవరి 7న జరిగే విచారణకు హాజరుకావాలని సంస్థ  చైర్మన్‌‌ ఎంఆర్‌‌ కుమార్, జోనల్, డివిజనల్‌‌ మేనేజర్లకు నోటీసులిచ్చింది. శ్రీనివాస్‌‌రావు, రవితేజ, రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను సోమవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్‌‌ తుకారాంజీల బెంచ్‌‌ విచారించింది. 1996లో 400 ఉద్యోగాల భర్తీకి ఎల్‌‌ఐసీ నోటిఫికేషన్‌‌ ఇచ్చి 350 మందినే తీసుకుంది. మిగిలిన 50 మంది హైకోర్టును ఆశ్రయిస్తే.. మెరిట్‌‌ ఉన్న వాళ్లను నియమించాలని సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఎల్‌‌ఐసీ అప్పీల్‌‌ను గతంలో బెంచ్‌‌ తిరస్కరించింది. అదే టైమ్​లో పిటిషనర్ల అప్లికేషన్లను ఎల్‌‌ఐసీ తిరస్కరించింది. దీంతో వారు కోర్టులో ధిక్కార పిల్ దాఖలు చేశారు.