ఎఫ్ఐఆర్ దాఖలైతే.. చార్జీషీటు దాఖలు చేయడానికి ఇంకెన్నేండ్లు?: హైకోర్టు

ఎఫ్ఐఆర్ దాఖలైతే.. చార్జీషీటు దాఖలు చేయడానికి ఇంకెన్నేండ్లు?: హైకోర్టు
  •     చెరువులో ఆలయ నిర్మాణానికి కలెక్టర్‌‌‌‌  నిధులెలా మంజూరు చేస్తారు?
  •     పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి
  •     బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్‌‌‌‌పై విచారణ

హైదరాబాద్, వెలుగు: జయశంకర్‌‌‌‌  భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పోలీసు స్టేషన్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతంరెడ్డిపై నమోదు చేసిన కేసులో పోలీసులు దర్యాప్తులో శ్రద్ధ తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాప్యం ఎందుకు జరుగుతోందని పోలీసులను ప్రశ్నించింది. జనవరిలో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌  దాఖలైతే ఇప్పటివరకూ చార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేదని నిలదీసింది. కొంపల్లిలోని గోరెంట్ల చెరువు శిఖం భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఆలయానికి కలెక్టర్‌‌‌‌  నిధులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది.

 ఏ అధికారాలపై నిధులు మంజూరు చేస్తారని అడిగింది. ఈ విధానం కొనసాగితే చెరువుల్లో ఎన్నో రకాల నిర్మాణాలు వెలుస్తాయని హెచ్చరించింది. కొనసాగిస్తే చెరువుల్లో ఇంకెలాంటి నిర్మాణాలు వస్తాయో ఉన్నతాధికారులకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత పిటిషన్‌‌‌‌  ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌‌‌‌  న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఉపసంహరణకు అనుమతించలేమని తేల్చి చెప్పింది. సర్వే నంబరు 209లో రెండెకరాల చెరువు శిఖం భూమిలో అధికారులను బెదిరించి వెంకటేశ్వరస్వామి ఆలయం, వాణిజ్య సముదాయం నిర్మాణం చేపట్టడంపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌‌‌‌  జూకంటి అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ మంగళవారం విచారించారు.