
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సుమారు రెండు గంటల పాటు వాదనలు జరిగాయి. ఆర్టీసీ స్థితిగతులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆర్టీసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం జీహెచ్ ఎంసీకి లేదన్నారు. ఆర్టీసీ బకాయిలు చెల్లించాలని ఎక్కడా చెప్పలేదన్నారు ఎండీ. అయితే ఎండీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాలు స్పష్టంగా లేవని చెప్పింది. బస్సుల కొనుగోలు కోసం చెల్లించిన రుణాల్ని రాయితీల బకాయిల చెల్లింపుగా ఎలా చెల్లిస్తారని ప్రశ్నించింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్టీసీ ఎండీగా ఉండి జీహెచ్ఎంసీ తరపున వాదించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానానికి నిజాలు చెప్పాలంటూ సీరియస్ అయ్యింది.
జీహెచ్ఎంసీ ఆర్టీసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నప్పుడు 2015-17 వరకు రూ.336 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించింది కోర్టు. బకాయిలు జీహెచ్ఎంసీ చెల్లించకపోతే ప్రభుత్వానికి లేఖ రాశారా అని ఆర్టీసీ ఎండీని ప్రశ్నించింది హైకోర్టు.. ప్రభుత్వం బకాయిలు ఇవ్వడం లేదు. జీహెచ్ఎంసీ చెల్లించలేమంటుంది. దీనిపై మీరేం చెబుతారని ప్రశ్నించింది హైకోర్టు. చట్టం ప్రకారం ఆర్టీసీకి జీహెచ్ ఎంసీ చెల్లించాల్సిన అవసరం ఉందా? లేదా అని ప్రశ్నించింది. . వాదనలు, రిపోర్టు చాలా కన్ఫూజన్ గా ఉన్నాయంటూ చెప్పింది హైకోర్టు. తదుపరి విచారణను గురువారం(7)కు వాయిదా వేసింది.