హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యాన పంటల అభివృద్ధికి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించి, ఆధునిక సాంకేతికతను రైతులకు చేరవేస్తామని హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. శనివారం వర్సిటీలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో ప్రస్తుతం 12.46 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుండగా, ఏటా 41.04 లక్షల టన్నుల దిగుబడి వస్తోందని ఆయన వెల్లడించారు. ఈ రంగంపై సుమారు 5.28 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నారని, సాధారణ వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల సాగుతో పెట్టుబడిపై అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉద్యాన రంగంలో హార్టికల్చర్-టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, సేంద్రీయ వ్యవసాయం, ఫిన్‌టెక్, ఎగుమతులు వంటి విభాగాల్లో విద్యార్థులు స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వీసీ తెలిపారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ రైతులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక పరిజ్ఞానాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ. భగవాన్, డీన్‌లు డాక్టర్ జె. చీనా, సురేశ్ కుమార్‌తో పాటు అధికారులు, బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
