
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫిర్యాదుదారులను పోలీసులు బెదిరించడం మానుకోవాలని పోలీసులకు స్పష్టమైన సూచనలు జారీ చేయాలని తెలంగాణ డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు చేసింది. 2018 ఏప్రిల్‌లో సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు తమను అక్రమంగా నిర్బంధించి, చేయని తప్పు ఒప్పుకోమని బలవంతం చేశారని ఆరోపిస్తూ జి. ప్రశాంత్ కుమార్ , మరొకరు హెచ్ఆర్ సీలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును, రికార్డులను కమిషన్ విచారించింది.
ఫిర్యాదుదారుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా.. సదరు ప్రైవేటు ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు పోలీసులు తమను బలవంతం చేసినట్టు, బెదిరించినట్టు బాధితులు హెచ్ ఆర్ సీని ఆశ్రయించారు. దీంతో కమిషన్ స్పందించింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం.. పోలీసుల దుష్ప్రవర్తనను నిరోధించడానికి, ఫిర్యాదుదారుల భద్రతను నిర్ధారించడానికి, ఆరోపించిన దుష్ప్రవర్తనపై ప్రాథమిక శాఖాపరమైన విచారణను ప్రారంభించడానికి సూచనలు జారీ చేయాలని కమిషన్ డీజీపీకి సిఫార్సు చేసింది.