- వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు, వ్యక్తి గత విషయాలపై ఓ వార్తా చానెల్ ప్రసారం చేసిన కథనాలను తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు లేకుండా, కేవలం అపోహలతో వార్తలను ప్రసారం చేయడం సరికాదని అసోసియేషన్ అభిప్రాయపడింది.
ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రామకృష్ణారావు, సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రకటన విడుదల చేశారు. ‘‘నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా అధి కారుల ఆత్మగౌరవం దెబ్బతినేలా, వాట్సాప్ చాట్‌లు, కంఫర్ట్ పోస్టింగ్‌లంటూ వచ్చిన వార్త ల్లో ఏమాత్రం నిజం లేదు.
అసత్య ప్రచారాలు చేసిన సదరు మీడియా సంస్థ తక్షణమే ఆ వార్తలను తొలగించి, భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్న వార్తలను ఇతర మాధ్యమాలు ప్రచారం చేయవద్దని సూచించారు.
