రాష్ట్రంలో PFI దాడులకు కుట్ర..ఇంటెలిజెన్స్ అలర్ట్

రాష్ట్రంలో PFI దాడులకు కుట్ర..ఇంటెలిజెన్స్ అలర్ట్

పీఎఫ్ఐ (Popular Front of India) కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసింది.. అక్కడి పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పీఎఫ్ఐ  దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మేరకు పీఎఫ్ఐ అనుసంబంధ సంస్థలపై నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. ఇంటెలిజెన్స్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులకు పోలీసులు అలర్ట్ ఇచ్చారు.

కాగా, గత నెలలో (సెప్టెంబర్) ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించి.. పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదారాబాద్ పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారలు సీజ్ చేశారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పీఎఫ్‌ఐ ప్రతినిధులు.. మతపరమై గొడవలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

5 ఏళ్లు పాటు ఆ సంస్థ కార్యకలాపాలపై చట్టవిరుద్ద నిరోధక చట్టం ప్రకారం కేంద్రం బ్యాన్ విధించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిషేధాన్ని మరింత పొడిగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. పీఎఫ్‌ఐ బ్యాన్‌పై ఆ సంస్ధ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిషేధం విధించడం దారుణమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.