కాలేజీకో కౌన్సెలర్‌‌… విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు..!

V6 Velugu Posted on Oct 30, 2019

తొలుత ప్రభుత్వ.. తర్వాత ప్రైవేటులో

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం

వెబ్​పాఠాలు, స్పెషల్​ క్లాసులతో టీచింగ్

త్వరలో అమలుకు ఇంటర్​ బోర్డ్​ నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు: ఇంటర్​ విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు కాలేజీకో కౌన్సెలర్​ను నియమించాలని బోర్డు నిర్ణయించింది. ప్రతీ కాలేజీలో స్టూడెంట్స్​తో క్లోజ్​గా ఉండే లెక్చరర్​కు ట్రైనింగ్​ ఇచ్చి, ఈ బాధ్యత అప్పజెప్పాలని తీర్మానించింది. ముందు సర్కారీ కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రైవేటు కాలేజీల్లోనూ దీనిని అమలుచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. స్టూడెంట్ల ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా బోర్డు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మొత్తం 404 ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీలుండగా, వాటిలో సుమారు 2 లక్షల మంది వరకూ చదువుతున్నారు.

గతేడాది పరీక్షల్లో ఫెయిల్‌‌‌‌ అయ్యామని పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అప్పటి గవర్నర్‌‌‌‌ నరసింహన్‌‌‌‌ దీనిపై సీరియస్​ అయ్యారు. నివారణ చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఇంటర్‌‌‌‌ బోర్డు.. ప్రతి కాలేజీలో విద్యార్థులతో క్లోజ్‌‌‌‌గా ఉండే లెక్చరర్‌‌‌‌ను కౌన్సెలర్‌‌‌‌గా నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు అన్ని కాలేజీల్లోనూ అలాంటి లెక్చరర్స్‌‌‌‌ను అధికారులు గుర్తించారు. వారందరికీ త్వరలోనే పలు స్వచ్ఛంద సంస్థలు, సీనియర్‌‌‌‌ సైకాలజిస్టులతో హైదరాబాద్‌‌‌‌లో క్లాసులు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందిన లెక్చరర్లు కాలేజీల్లోని స్టూడెంట్స్‌‌‌‌కు ఎగ్జామ్స్‌‌‌‌ టిప్స్‌‌‌‌, మెమరీ టిప్స్‌‌‌‌, పరీక్షలకు ఎలా ప్రిపేర్‌‌‌‌ కావాలి, సెల్ఫ్‌‌‌‌ మేనేజ్మెంట్‌‌‌‌, ఒత్తిడి తట్టుకోవడం ఎలా.? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పరీక్షలు, ఫలితాల సమయంలో స్టూడెంట్స్ ను ఒత్తిడికి దూరం చేయాలని భావిస్తున్నారు.

స్టూడెంట్స్‌‌‌‌కు స్పెషల్‌‌‌‌ క్లాసులు..

విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు టెక్నాలజీని వాడుకోవాలని ఇంటర్‌‌‌‌ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి సబ్జెక్ట్‌‌‌‌లోనూ స్పెషల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ను తయారు చేయించి, వాటిని సీడీల్లో భద్రపరిచింది. వీటిని అన్ని కాలేజీలకు పంపించడంతో పాటు త్వరలోనే ఇంటర్ బోర్డు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. దీనికితోడు సబ్జెక్ట్​ల వారీగా వెనకబడిన విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్​లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. సప్లిమెంటరీ స్టూడెంట్స్‌‌‌‌ కు కూడా త్వరలోనే స్పెషల్‌‌‌‌ క్లాసులు నిర్వహించనున్నారు. అవసరాన్నిబట్టి లైవ్‌‌‌‌ స్ట్రీమింగ్‌‌‌‌ (ప్రత్యక్ష ప్రసారం) ఏర్పాటుచేసి, అన్ని కాలేజీల విద్యార్థులందరూ ఒకేసారి పాఠాలు వినేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానాన్ని త్వరలోనే ఎడ్యుకేషన్  మినిస్టర్‌‌‌‌ ద్వారా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు
చేస్తున్నారు.


ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా కాలేజీల్లో కౌన్సెలర్స్‌‌‌‌ను నియమిస్తున్నం. వారికి శిక్షణ ఇచ్చి, వారి ద్వారా స్టూడెంట్స్‌‌‌‌కు అవగాహన కల్పిస్తం. వారం, పదిరోజుల్లో స్టూడెంట్స్ వెల్ఫెర్‌‌‌‌  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను కూడా ప్రారంభిస్తం. దాంట్లో అన్ని సబ్జెక్టుల కంటెంట్‌‌‌‌ పెడుతున్నం. ఇది విద్యార్థులకు పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుంది. నీట్‌‌‌‌, ఎంసెట్‌‌‌‌,  ఐఐటీ శిక్షణ కూడా త్వరలో ప్రారంభిస్తం.

– ఒమర్‌‌‌‌ జలీల్‌‌‌‌, ఇంటర్‌‌‌‌ బోర్డు కార్యదర్శి

Tagged Telangana, telangana inter board, counselor

Latest Videos

Subscribe Now

More News