
- ఫస్టియర్ అడ్మిషన్ నోటిఫికేషన్‌పై అయోమయం
- నెలాఖరు వరకు కాలేజీలకు ఇంటర్ బోర్డు పర్మిషన్ ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన ఇంటర్ కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలి. అఫిలియేషన్ పొందిన కాలేజీల లిస్టు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఉంటుంది” ఇది సరిగ్గా నెలరోజుల క్రితం ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ నోటిఫికేషన్ సందర్భంగా ఇంటర్ బోర్డు ప్రకటన. అయితే ఈ ప్రకటన అమలు కావడం లేదు. ఏ ఒక్క కాలేజీకి గుర్తింపు ఇవ్వకుండానే, అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు పర్మిషన్ ఇచ్చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ఒక్క ఇంటర్మీడియేట్ కాలేజీకి ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు. అయినా, అడ్మిషన్ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేసింది. గుర్తింపు పొందిన కాలేజీల లిస్టును ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో పెడ్తామని ఆర్భాటంగా ప్రకటన చేసిన అధికారులు.. ఇప్పటికీ ఏ ఒక్క కాలేజీకీ గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఏ లిస్టు ఆధారంగా అడ్మిషన్లు పొందాలనే దానిపై అయోమయం నెలకొన్నది.
సర్కార్ కాలేజీలకు కూడా ఇవ్వలే..
రాష్ట్రంలో సుమారు 3,249 ఇంటర్మీడియేట్ కాలేజీలున్నాయి. వీటిలో సుమారు 1,500 వరకూ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఉండగా, 2024–25లో 1,443 కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 2025–26 అఫిలియేషన్ కోసం ఇంటర్ బోర్డు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 4తో దరఖాస్తునకు చివరి రోజు అని ప్రకటించింది. ఇక ఫైన్ తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికీ ఏ ఒక్క కాలేజీకీ గుర్తింపు ఇవ్వలేదు.
చివరికి సర్కారు కాలేజీలు, గురుకులాలకూ అఫిలియేషన్ ఇవ్వలేదు. అయితే, వచ్చే విద్యాసంవత్సరం కోసం సుమారు 920 కాలేజీల వరకూ రిజిస్టర్ చేసుకున్నాయి. వీటిని డీఐఈఓలు వెరిఫై చేసి.. అన్నీ సక్రమంగా ఉంటే వారికి ఫీజు పేమెంట్ చేసేందుకు అవకాశం ఇస్తారు. ఈ లెక్కన ఇప్పటికీ ఏ ఒక్క కాలేజీ కూడా ఫీజు చెల్లించలేదు. అంటే, రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఇంటర్మీడియేట్ కాలేజీకీ ఇంటర్ బోర్డు అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదన్నట్లే.
ఏ కాలేజీలో చేరాలే?
గత నెల 30న ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ మే ఒకటో తేదీ నుంచి 30 వరకూ ఉంటుంది. జూన్ 2 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నది. అయితే, టెన్త్ పాసైన విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనే దానిపై అందరిలో అయోమయం నెలకొన్నది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీలకు, ఫైర్ సెఫ్టీ లేని కాలేజీలకు చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది ఆ కాలేజీలకు గుర్తింపు ఇవ్వబోమని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే, ఇప్పటికీ ఆ కాలేజీల లిస్టును మాత్రం బోర్డు ప్రకటించలేదు. వెబ్ సైట్ లో చూసి అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పిన అధికారులు.. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క పేరును వెబ్ సైట్ లో పెట్టకపోవడం గమనార్హం.
ప్రైవేటు కాలేజీల అఫియేషన్ ప్రక్రియ పూర్తికావాలంటే ఇంకో రెండు నెలలు టైమ్ పెట్టే అవకాశం ఉందని అధికారులే చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ముందస్తు అనుమతులు ఎందుకు వచ్చినట్టు అనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని కాలేజీల్లో చేరొద్దనే ప్రకటన కూడా ఇంటర్ బోర్డు నుంచి రాలేదు. ఈ విషయం తెలియని పేరెంట్స్ వారి పిల్లలను అలాంటి కాలేజీల్లోనే చేర్చితే, దానికి ఎవరు బాధ్యులనే దానిపై స్పష్టత కరువైంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ అధికారులు అఫిలియేషన్లు, అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు.